శ్రీకాకుళంలో సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి భారీ తిమింగలం కొట్టుకువచ్చింది.
By Srikanth Gundamalla Published on 28 July 2023 5:18 PM IST
శ్రీకాకుళంలో సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం
తెలంగాణతో పాటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు గ్రామాలు నీటమునిగాయి. రహదారులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. చాలా కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల పొలాల్లోనూ కొన్ని చోట్ల నీళ్లు నిలిచాయి. వ్యవసాయానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి భారీ తిమింగలం కొట్టుకువచ్చింది. భారీ కాయం ఉన్న తిమింగలాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు .
సుమారు 25 అడుగుల పొడవు , ఐదు టన్నుల వరకు బరువు ఉంటుంది. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తీరానికి వస్తున్నారు. చాలా పెద్ద సైజులో ఉన్న తిమింగలంతో సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. సముద్ర తీరానికి అప్పుడప్పుడు అరుదైన చేపలు, భారీ తిమింగలాలు వస్తుంటాయి. ఇలాంటివి అరుదుగా జరుగుతుండటంతో జనాలు ఎక్కువగా వస్తున్నారు. అయితే.. ఈ తిమింగలం చనిపోయింది. నీలి రంగులో ఉన్న తిమింగలాన్ని బ్లూవేల్ అంటారని మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రంలో ఇలాంటి భారీ జీవులు ఉంటాయని వినడమే తప్ప.. చూడటం ఇదే మొదటిసారి అంటున్నారు భారీ తిమింగలాన్ని చూసినవారంతా.