మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని కారుకి ప్రమాదం
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కారుకి స్వల్ప ప్రమాదం జరిగింది.
By Srikanth Gundamalla Published on 20 Oct 2023 6:05 AM GMTమాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని కారుకి ప్రమాదం
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కాన్వాయ్‌కి స్వల్ప ప్రమాదం జరిగింది. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం కొడాలి నాని కుటుంబ సమేతంగా విజయవాడకు వచ్చారు. ఆ తర్వాత దుర్గమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో వినాయకుడి గుడి దగ్గర సిమెంట్ బారికేడ్‌ను కొడాలి నాని కారు ఒక్కసారిగా ఢీకొట్టింది. దాంతో కారు పాక్షికంగా దెబ్బతిన్నది. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి గురైన కారులోనే కొడాలి నానితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు.
కాగా.. చిన్నప్రమాదమే కావడంతో పోలీసులతో పాటు భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా కొడాలి నాని అదే కారులో గుడికి వెళ్లారని తెలుస్తోంది. కాగా.. కొడాలి నాని కారుకు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు, అభిమానులు షాక్ తిన్నారు. కొందరైతే వెంటనే కొడాలి నానికి ఫోన్ చేసి ఆరా తీశారు. చిన్న ప్రమాదమే అని.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆయన వివరించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
కాగా.. గురువారం నాడు కొడాలి నాని ఇంట్లో శుభకార్యం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా నాని మేనకోడలి పెళ్లి వేడుక జరిగింది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి కూడా హాజరయ్యారు. కంకిపాడు అయాన కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం శుక్రవారం గుడికి వెళ్లగా ప్రమాదం చోటుచేసుకుంది.