అమరావతి రైతులకు శుభవార్త.. నెలాఖరు వరకు డబ్బులు!
అమరావతి రైతులకు అధికారులు శుభవార్త చెబుతున్నారు.
By Srikanth Gundamalla Published on 22 July 2024 8:15 AM ISTఅమరావతి రైతులకు శుభవార్త.. నెలాఖరు వరకు డబ్బులు!
అమరావతి రైతులకు అధికారులు శుభవార్త చెబుతున్నారు. రాజధాని రైతులకు చెల్లించాల్సిన కౌలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. అమరావతి రైతుల నుంచి కౌలు చెల్లింపు కోసం వినతులు వస్తున్నాయనీ.. ఈ నేపథ్యంలో ఆ డబ్బులను జమ చేసేందుకు మున్సిపల్ శాఖ మంత్రి దృష్టి సారించారని పేర్కొన్నారు. ఈ మేరకు రాజధాని రైతులకు ప్రభుత్వం 300 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయని అంచనాకు వచ్చినట్లు సమాచారం. కౌలు బకాయిల అంశాన్ని సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లిన తర్వాత.. ఆయన ఆమోదంతో అమరావతి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారని తెలిసింది. అయితే.. నెలాఖరులోగా కౌలు చెల్లించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.
సకాలంలో కైలు డబ్బులు రాకపోవడంతో అప్పులపాలు అయ్యామంటూ అమరావతి రైతులు ఆవేదన చెందుతున్నారు. గత రెండేళ్లుగా కౌలు ప్రస్తావనే లేదని అంటున్నారు. ఇప్పుడు అప్పుడు పుట్ట పరిస్థితి కూడా లేదని అంటున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు కౌలు చెల్లించి.. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా.. ఏపీ రాజధాని అమరావతి కోసం 28,656 మంది రైతులు దాదాపు 34 వేల ఎకరాల భూములు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరు చిన్న, సన్నకారు రైతులు.. ఆర్థికపరమైన ఇబ్బందులతో రిటర్నబుల్ ప్లాట్లు అమ్ముకున్నారు. ఈ కారణంగా వారంతా కౌలుకు అనర్హులయ్యారు. తాజా లెక్క ప్రకారం 28,656 మందిలో కేవలం 22,980 మందికి మాత్రమే కౌలు వస్తుంది.. వీరిలో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు, గిరిజన, దళిత, బీసీ, మైనార్టీ, అసైన్డ్ రైతులే ఉన్నారు.