వాటర్ హీటర్‌ను తాకి చిన్నారి మృతి, ఇద్దరికి గాయాలు
తాజాగా వాటర్ హీటర్‌ను ముట్టుకుని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
By Srikanth Gundamalla Published on 6 Jan 2024 9:36 AM ISTవాటర్ హీటర్‌ను తాకి చిన్నారి మృతి, ఇద్దరికి గాయాలు
విద్యుత్ పరికరాలతో జాగ్రత్తగా ఉండాలని పదేపదే చెబుతుంటారు. కానీ.. అనుకోని సంఘటనలు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా వాటర్ హీటర్‌ను ముట్టుకుని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అంతేకాదు.. ఆ చిన్నారి తల్లితో పాము మరో పాపకు గాయాలు అయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో చోటు చేసుకుంది.
తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో వెంకటరాముడు, నాగజ్యోతి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్దపాప విహన్యశ్రీకి ఐదేళ్లు. చిన్నకూతురు జేష్ట శ్రీ. వెంకటరాముడు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నాగజ్యోతి వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే.. పెద్ద కూతురు విహన్యశ్రీ ఎల్‌కేజీ చదువుతోంది. ఉదయం చిన్నారులకు స్నానం చేయించేందుకు తల్లి నాగజ్యోతి వాటర్ హీటర్ వేసింది. నీళ్లలోని హీటర్‌ను ఉంచి పనులు చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరికీ ఒకేసారి స్నానం చేయిద్దామని వారిని తీసుకుని బాత్రూమ్‌కు తీసుకెళ్లింది.
అయితే.. పెద్దూతురు విహన్యశ్రీ బకెట్‌లో ఉన్న వాటర్ హీటర్‌ను తాకింది. ముగ్గురు పక్కపక్కనే ఉండటంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. బాత్రమూలోనే అపస్మారక స్థితిలో పడిపోయారు. అయితే.. ఎంతసేపటికీ భార్య, కూతుళ్లు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త తలుపుతట్టాడు. కానీ.. వారు డోర్ తెరవలేదు. ఎలాంటి స్పందన లేదు. దాంతో.. స్థానికుల సాయంతో డోర్ పగలగొట్టి ముగ్గురినీ ఆస్పత్రికి తరలించాడు. అయితే..వారిని పరిశీలించిన వైద్యులు విహన్యక్ష ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న నాగజ్యోతిని మెరుగైన చికిత్స కోసం ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. చిన్నకుమార్తె జేష్టశ్రీకి స్వల్ప గాయాలు అయ్యాయి. ఒకే సంఘటనలో పాప చనిపోవడం.. ఇద్దరూ ప్రాణాపాయంలో పడటంతో స్థానికలు, బంధువుల్లో విషాదం నెలకొంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.