ఏలూరు: 100 మందికి పైగా అస్వస్థత
Eluru people fell to illness due to unidentified problem .. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో శనివారం ఉన్నట్టుండి 100
By సుభాష్ Published on 6 Dec 2020 3:03 AM GMTపశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలో శనివారం ఉన్నట్టుండి 100 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులు స్కృహ తప్పి పడిపోవడంతో వారిని అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముందుగా ఒకటో పట్టణ పరిధిలో కొందరు అస్వస్థకు గురికాగా, శనివారం రాత్రి నగరంలోని పడమర వీధి, కొత్త పేట, తాపీమేస్త్రీ కాలనీ, అశోక్‌నగర్, తంగెళ్లమూడి, శనివారపుపేట,ఆదివారపుపేట, అరుంధతిపేట తదితర ప్రాంతాల్లోనూ బాధితుల సంఖ్య పెరిగిపోయింది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి 12 గంటల వరకు ఆస్పత్రిలో 95 మంది ఇదేరకంగా అస్వస్థతకు గురైన చేరినట్లు ఏలూరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ తెలిపారు. వీరిలో 22మంది చిన్నపిల్లలు, 40 మందికి మహిళలు, 33 మందికిపైగా పురుషులున్నారని తెలిపారు. అస్వస్థకు గురైనవారికి వెంటనే ఆక్సిజన్ అందించిన కొద్దిసేపటికే తెరుకున్నారని అన్నారు. కొందరు మూర్ఛ లక్షణాలతో, ఇంకొందరు స్కృహతప్పి పడిపోయే పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
సమాచారం అందుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అధికారులతో కలిసి దక్షిణవీధికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అస్వస్థకు గురైన వారికి ఎలాంటి ప్రాణ నష్టం లేదని మంత్రి చెప్పారు. విజయవాడలోనూ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని, విజయవాడ జనరల్ ఆస్పత్రి నుంచి వైద్యులు, జనరల్ ఫిజీషియన్, ఇతర వైద్యులు హుటాహుటిన ఏలూరు వెళ్లారు. ఏలూరులోని పలు ప్రాంతాల్లో ప్రజలు అస్వస్థకు గురవుతుండటంతో సంబంధిత అధికారులతో కలెక్టర్ ముత్యారాజు శనివారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. బాధితుల కోసం నగరంలో రెండు ఆస్పత్రుల్లో 150 పడకలు సిద్ధం చేసినట్లుచెప్పారు. కాగా, ఏలూరు లోని పలు ప్రాంతాలలో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, మందులను అందుబాటులో ఉంచి, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.