ఆరేళ్ల బాలికపై వీధి కుక్కల దాడి (వీడియో)

గుంటూరు జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్కల గుంపు దాడి చేశాయి.

By Srikanth Gundamalla  Published on  11 Jan 2024 11:10 AM GMT
dogs attack,  six years girl,  guntur ,

ఆరేళ్ల బాలికపై వీధి కుక్కల దాడి (వీడియో)

చిన్నారుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారు బయటకు వెళ్లినా.. ఇంట్లో ఆడుకుంటూ తరచూ ప్రమాదాల్లో పడుతుంటారు. అయితే.. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రోడ్లపై అటు ఇటూ పరిగెత్తకుండా చూసుకోవాలి. ఇక ఈ మధ్యకాలంలో చిన్నారులు ఒంటరిగా కనిపిస్తే చాలు.. కుక్కలు దాడులు చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పిల్లలు ప్రాణాలు కోల్పోతే.. మరికొన్ని ఘటనల్లో తీవ్రగాయాల పాలై ఆస్పత్రుల్లో చేరారు. తాజాగా గుంటూరు జిల్లాలో కూడా ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్కల గుంపు దాడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుంటూరులోని సంపత్‌ నగర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. నడుచుకుంటూ ఆరేళ్ల బాలిక వీధిలో వెళ్తోంది. సీసీఫుటేజ్‌ ఆధారంగా ఈ సంఘటన జనవరి 9వ తేదీన చోటుచేసుకున్టన్నట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల సమయంలో బాలిక రోడ్డుమీదకు వచ్చింది. ఇక చిన్నారిని గమనించిన కొన్ని వీధి కుక్కలు ఆ పాప వెంట పడ్డాయి. దాంతో.. భయపడిపోయిన చిన్నారి అరుస్తూ పరుగు తీసింది. ఇక అక్కడే కొందరు వ్యక్తులు చిన్నారి అరుపులను విన్నారు. వీధికుక్కలు వెంటపడుతుండటాన్ని చూసి వెంటనే అప్రమత్తం అయ్యారు. వీధికుక్కలను వెళ్లగొట్టేందుకు అరుస్తూ వెళ్లారు. కానీ కుక్కలు ఏమాత్రం భయపడలేదు. చిన్నారిని కిందపడేసి నోటితో కరిచాయి. చివరకు మరికొందరు కూడా అరుస్తూ రావడంతో కుక్కలు అక్కడి నుంచి పారిపోయాయి. కాగా.. చిన్నారిని కాపాడిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

ఇక పది రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో ఆరేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. వరుసగా వీధికుక్కల దాడి ఘటనలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు, అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీధికుక్కల విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

Next Story