పనితీరు బాగుంటేనే ఎమ్మెల్యేలకు టికెట్లు: సీఎం జగన్
ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.
By Srikanth Gundamalla
పనితీరు బాగుంటేనే ఎమ్మెల్యేలకు టికెట్లు: సీఎం జగన్
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి.. వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. తొందరలోనే కొత్త కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్పారు. జగనన్న సురక్ష తర్వాత మరో కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అయితే.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం మాత్రం చాల కీలకమని చెప్పారు. అలాగే రాబోయే 3 నెలలు మనందరికీ ఎంతో ముఖ్యమని.. అందరూ బాగా కష్టపడి పనిచేయాలని సూచించారు సీఎం జగన్.
రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లు కచ్చితంగా గెలవాల్సిందేనని చెప్పారు. ఇందుకోసం బాగా పనిచేయాలని చెప్పారు. అయితే.. ఎమ్మెల్యేల పనితీరు బాగుంటేనే టికెట్లు ఇస్తామని.. లేదంటే అలాంటి వారిని పక్కన పెడతామని చెప్పారు. కొన్ని కోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారు.. పేదలకు మంచి జరగాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి ఎమ్మెల్యే తమ గ్రాఫ్ పెంచుకుంటూ.. ప్రజలకు మంచి పనులు చేసిపెట్టాలని తెలిపారు. గడప గడపకు కార్యక్రమంలోనే చురుగ్గా పాల్గొన్న వారి గ్రాఫ్ ఆటోమెటిక్‌గా పెరుగుతుందన్నారు. పని చేయని వారికి టికెట్లు ఇవ్వడం ద్వారా వాళ్లు ఓడిపోవడమే కాదు.. పార్టీకి కూడా నష్టం జరుగుతుందని చెప్పారు. 15 నుంచి 20 మంది ఎమ్మెల్యే పని తీరు ఏ మాత్రం బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే సమావేశం నాటికి వారంతా పనితీరు మెరుగుపర్చుకోవాలని సీఎం జగన్. అందరూ కష్టపడి పని చేస్తేనే 175కి 175 సీట్లు గెలవగలమని మరోసారి చెప్పారు సీఎం జగన్.