వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందని సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 11 Dec 2023 1:13 PM ISTవైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందని సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు 2023-2024 సంవత్సరానికి సంబంధించి రెండో విడత వైఎస్సార్ లా నేస్తం నిధులను విడుదల చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. జూనియర్ న్యాయవాదులకు ఈ కార్యక్రమం తోడుగా నిలబడుతుందని చెప్పారు. ఇవాళ 2,807 మంది న్యాయవాదులకు మేలు చేస్తున్నాని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,807 మంది జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు స్టైఫండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలలకు ఒక్కొక్కరికి రూ.30వేల వంతున మొత్తం రూ.7,98,95,000 వారివారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 6,069 మంది న్యాయవాదులకు మేలు జరిగిందని చెప్పారు. నాలుగున్నరేళ్లలో రూ.49.51 కోట్లు అందించామని సీఎం జగన్ చెప్పారు. న్యాయవాదుల కోసం రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామన్నారు సీఎం జగన్. పేదవాడి తరఫున న్యాయవాదులంతా ఔదార్యం చూపించాలని ఈసందర్భంగా చెప్పారు.
అలాగే కోవిడ్ సమయంలోనూ న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడిందని సీఎం జగన్ గుర్తు చేశారు. నాలుగేళ్లుగా యువ లాయర్లకు అండగా ఉంటున్నామని చెప్పారు. పేదలకు యువ లాయర్లు అండగా ఉంటూ.. వారికి తగిన విధంగా న్యాయాన్ని అందించాలని సూచించారు. అన్ని కార్యక్రమాలు మంచి మనసు పెట్టి, మంచి జరగాలని మనసారా ఆలోచించి చేస్తున్నామని అన్నారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో తన దగ్గరకు వచ్చి వినతిపత్రం ఇచ్చినప్పుడే మాట ఇచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు. అందుకే ఇప్పుడు వాళ్లందరికీ తోడుగా ఉంటూ అడుగులు వేశానని చెప్పారు. దేవుడి దయతో అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు ఏపీ సీఎం జగన్. మంచి పనులు చేసే అవకాశాలు మరిన్ని రావాలని అన్నారు.