మిచౌంగ్ తుపాను బాధితులకు మంచి సదుపాయాలు కల్పించాలి: జగన్
మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 2:15 PM ISTమిచౌంగ్ తుపాను బాధితులకు మంచి సదుపాయాలు కల్పించాలి: జగన్
మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు బాగా వేగంగా వీస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో చెట్లు విరిగి నేలకొరుగుతున్నాయి. అయితే... మిచౌంగ్ తుపాను పరిస్థితులు, సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై ఆరా తీవారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. మిచౌంగ్ తుపాను బాధితులకు సహాయం అందించాలని సూచించారు. అలాగే వరద ముంపు ప్రాంతాల్లోని వారికి శిబిరాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పారు. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదని సీఎం జగన్ అధికారులకు సూచించారు. నెల్లూరు, తిరుపతి సహా తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆదేశించారు. అలాగే మనుషులు చనిపోయినా.. పశువులు మరణించినట్లు సమాచారం అందితే వారికి 48 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం జగన్ చెప్పారు. తుపాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ కూడా ప్రారంభించాలన్నారు సీఎం జగన్. గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను వాడుకుని రేషన్ పంపిణీ సమర్ధంగా అందించాలని సీఎం జగన్ చెప్పారు.
అలాగే తుపాను కదలికలను గురించి సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. నెల్లూరు-కావలి మధ్య సగం ల్యాండ్ ఫాల్, సగం సముద్రంలో తుపాను గమనం ఉందని తెలిపారు. చీరాల, బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటుతుందని చెప్పారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం ఉదయం నుంచే కొనసాగుతోందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అయితే.. అది క్రమంగా ఇప్పుడు తగ్గుతోందని చెప్పారు. అలాగే వర్షం ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశామని అధికారులు సీఎం జగన్‌కు చెప్పారు. 211 సహాయక శిబిరాల్లో సుమారు 9500 మందికి ఆశ్రయం కల్పించినట్లు అధికారులు చెప్పారు.