పేదలకు అండగా ఉండాలనే ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ కలెక్టర్లు, ఆరోగ్యశాఖ అధికారులతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 18 Dec 2023 9:05 AM GMTపేదలకు అండగా ఉండాలనే ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు: సీఎం జగన్
ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ కలెక్టర్లు, ఆరోగ్యశాఖ అధికారులతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీఎంవోలో జరిగిన ఈ భేటీలో ఆరోగ్యశాఖ మంత్రి రజినీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. వైద్య చికిత్స కోసం రాష్ట్రంలోని ఏ పేదవాడూ అప్పులపాలయ్యే పరిస్థితి ఉండొద్దని అన్నారు. పేదలకు వైద్యం భారం అవ్వొద్దనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ సూచించారు.
పేదల కోసమే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. అంతేకాదు కొత్తగా మరికొందరికి జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష కార్డులను కూడా సీఎం జగన్ జారీ చేశారు. ఈ కార్డులో లబ్ధిదారులకు ఫొటోతో పాటు ఇతర వివరాలను పొందుపరిచి క్యూఆర్ కోడ్‌తో రూపొందించినట్లు సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో పేదలకు ఉచిత వైద్యం అందించే క్రమంలో ఏపీ వ్యాప్తంగా ఉన్న 2,513 ఆస్పత్రులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆస్పత్రులను కూడా ఎంప్యానెల్ చేసినట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ వివరించారు.
తెలంగాణలోని హైదరాబాద్‌లో పలు పెద్దాసుపత్రుల్లో కూడా ఎంప్యానెల్ చేశామన్నారు సీఎం జగన్. స్పెషాలిటీ సేవలను పేదలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం పేదవారికి రూ.5లక్షలకు మించి ఇవ్వలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం క్యాన్సర్ బాధితుల చికిత్సకు ఎంతైనా సరే ప్రభుత్వమే చెల్లిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్భుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూన.4,100 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఏపీ వ్యాప్తంగా 4.25 కోట్ల మంది ఆరోగ్యశ్రీ కిందకు వస్తారని చెప్పారు. ఆరోగ్యశ్రీ లో భాగంగా చికిత్స తో పాటు ఆ తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలోనూ ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందని సీఎం జగన్ అన్నారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి కాలానికి ఆరోగ్య ఆసరా కింద నెలకు రూ.5వేల చొప్పున పేదవారికి ఇస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు.