ఆరోగ్యశ్రీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

CM Jagan Key Decision on Arogyasree.ఆరోగ్యశ్రీ సేవలకు ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్

By M.S.R  Published on  14 Dec 2021 6:35 AM GMT
ఆరోగ్యశ్రీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆరోగ్యశ్రీ సేవలకు ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. నాడు-నేడు, ఆరోగ్య సేవలు, ఆరోగ్యశ్రీ సేవలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. అధికారులతో సమగ్రంగా వివిధ అంశాలపై చర్చించిన వైఎస్ జగన్..ఇందుకు అనుగుణంగా ఆదేశాలిచ్చారు.కేంద్రంతో సమన్వయం చేసుకుని నిర్దేశించిన వయస్సులవారికి డబుల్ డోస్ కచ్చితంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒమిక్రాన్ సంక్రమణ నేపధ్యంలో ఎయిర్‌పోర్టుల్లో విధిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. వారం రోజుల్లో జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్నింటికంటే మించి త్వరలో ఆరోగ్య సేవలు, ఆరోగ్యశ్రీకు సంబంధించి ప్రత్యేక యాప్ తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇందులో సందేహాల్ని నివృత్తి చేసేలా యాప్‌లో అన్ని సదుపాయాలుండాలని సూచించారు.

ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు సులభమైన మార్గంలో సమాచారం అందేలా ఓ యాప్ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఏ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు లభిస్తాయి? రోగులు ఏ ఆసుపత్రికి వెళ్లాలి? అనే అంశాలకు యాప్ ద్వారా సరైన మార్గదర్శనం చేయాలని నిర్దేశించారు. ఆరోగ్యశ్రీ పథకంలో 'రిఫరల్' అన్నది ఎంతో కీలమైనదని, యాప్ ద్వారా దాన్ని మరింత పరిపుష్టం, సరళతరం చేయాలని సీఎం జగన్ సూచించారు. ఈ రిఫరల్ విధానానికి విలేజ్ క్లినిక్ అనేది కేంద్రంగా మారాలని తెలిపారు. రాష్ట్రంలోని ఆరోగ్య మిత్రలకు సెల్ ఫోన్లు ఇచ్చి, అందులో ఆరోగ్యశ్రీ యాప్ పొందుపరిచే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు.

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌తో పాటుగా సంబంధిత శాఖలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌ కాలేజీల్లో సూపర్‌ స్పెషాల్టీ సేవలు అందుతాయని సీఎం జగన్ తెలిపారు. క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రత్యేకంగా మూడు సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు ఏర్పాటవుతాయని తెలిపారు. వీటితో పాటు గతంలోనే ప్రకటించిన విధంగా చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా మూడు ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకుని రానున్నామన్నారు. క్యాన్సర్ చికిత్స కోసం ఏర్పాటు చేసే మూడు సూపర్ స్పెషాల్టి ఆస్పతుల్లో కాన్సర్ బాధితులకు అత్యుత్తమ చికిత్స అందించనున్నట్టుగా సీఎం జగన్ తెలిపారు. క్యాన్సర్ బాధితులు చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు. క్యాన్సర్‌ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిస్థాయిలో చికిత్సలు, ఇతర సేవలు అందాలని స్పష్టం చేశారు.

Next Story