ఢిల్లీకి సీఎం జగన్.. ఏపీకి లోకేశ్, రాష్ట్రంలో పొలిటికల్ హీట్
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.
By Srikanth Gundamalla Published on 5 Oct 2023 6:06 AM GMTఢిల్లీకి సీఎం జగన్.. ఏపీకి లోకేశ్, రాష్ట్రంలో పొలిటికల్ హీట్
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలు.. నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టి తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇక ఇటు వైసీపీ నాయకులు కూడా ప్రతిపక్ష నాయకుల విమర్శలకు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. అయితే.. చంద్రబాబుని బయటకు తీసుకొచ్చేందుకు నారా లోకేశ్‌తో పాటు వారి తరఫు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దల మద్దతు మూటగట్టేందుకు.. ఇటు ఏపీలో రాజకీయాల పరిస్థితులను తెలియజేసేందుకు కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉండిపోయారు నారా లోకేశ్. ఇక చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ సీఎం జగన్ తొలిసారి ఢిల్లీ వెళ్తున్నారు. అదే సమయానికి అక్కడున్న లోకేశ్ ఏపీకి వస్తున్నారు. దాంతో.. ఇద్దరి పయనాలు ఒకే సమయంలో ఉండటంతో దీని వెనుక ఏమైనా మతలబు ఉందా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది.
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీఎం జగన్ తొలిసారి ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే.. సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత కొద్దిరోజుల పాటు ఆయన తనయుడు నారా లోకేశ్ ఢిల్లీలోనే ఉండిపోయారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో కక్ష రాజకీయాలు నడుస్తున్నాయని కలుగజేసుకోవాలని కోరారు. మరోవైపు ఇతర నాయకులను కూడా కలిసి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమకు మద్దతు ఇవ్వాలని కోరారు నారా లోకేశ్. ఇక ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాదులో తరచూ మాట్లాడుతూ చంద్రబాబుని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ సీఎం జగన్ తొలిసారి ఢిల్లీ వెళ్తున్నారు. అదే సమయంలో ఏపీకి తిరిగి వస్తున్నారు నారా లోకేశ్. దాంతో ఈయన అటు.. ఆయన ఇటు అన్నట్లు అయ్యింది. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై కేంద్ర పెద్దలు ఏపీ సీఎం జగన్‌తో ఏం చెప్తారో అని ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో చంద్రబాబుకి ఊరట లభిస్తుందని టీడీపీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుని బట్టి తదుపరి కార్యాచరణను రూపొందించాలని లోకేశ్ ఆలోచిస్తున్నారు. ఈ సమయం కేంద్ర పెద్దలను జగన్ కలవనుండటం.. రాష్ట్రంలో పరిస్థితులను చెప్పడం ఆతర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని ఆసక్తి నెలకొంది. మరోవైపు లోకేశ్ అక్టోబర్ 9న సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈయన అటు.. ఆయన ఇటు లాగా జగన్, లోకేశ్ పయనాలు ఉండటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.