చంద్రబాబు దొంగగా దొరికితే.. ముఠా జీర్ణించుకోలేకపోతుంది: సీఎం జగన్
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం గురించి ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 16 Sep 2023 8:15 AM GMTచంద్రబాబు దొంగగా దొరికితే.. ముఠా జీర్ణించుకోలేకపోతుంది: సీఎం జగన్
ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం గురించి ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దొరికిన దొంగ అని పేర్కొన్నారు. అయితే.. ఆయన దొంగగా దొరికినప్పటికీ.. ఆయనకున్న బలమైన ముఠా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. అయితే.. ప్రభుత్వ నిబంధనలను పక్కనబెట్టి నకిలీ ఒప్పందంతో ప్రజాధనాన్ని దోచుకున్నారని సీఎం జగన్ అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతంలో నిర్వహించిన వైఎస్ఆర్ కాపు నేస్తం విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు, జైలు అంశాలను ప్రస్తావించారు. కూపీలాగగా చంద్రబాబు అక్రమం బయట పడిందని చెప్పారు. కోర్టుల్లో గంటపాటు విచారణ జరిగినా ముఠాకు చంద్రబాబులో తప్పు కనిపించడం లేదని అన్నారు. చట్టం ఎవరికైనా ఒక్కటే అని చెప్పే వారు ఇన్నాళ్లు లేరని వ్యాఖ్యానించారు. ఒక మామూలు వ్యక్తి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో.. అధికారంలో ఉన్నవారికి కూడా అదే శిక్ష పడుతుందని చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికినా.. చివరికి ఆ వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చినా ఆయన మద్దతు దారులు బాబు ఏ తప్పు చేయలేదనే చెప్పడానికి సిద్ధం అయ్యాయని సీఎం జగన్ అన్నారు.
ములాఖత్ ద్వారా మిలాఖత్ అయి.. కొందరు పొత్తు రాజకీయాలకు తెరదీశారంటూ పరోక్షంగా జనసేన అధినేత పవన్‌పైనా విమర్శలు గుప్పించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో ముందుగా ప్రభుత్వ సొమ్ము ఇవ్వొద్దని అధికారులు చెప్పినా వినకుండా బలవంతంగా చంద్రబాబు ఒత్తిడితోనే ప్రజాధనం దోచుకున్నారని జగన్ అన్నారు. ప్రజలంతా చంద్రబాబు దోపిడీని గుర్తించాలని.. ఆలోచన చేయాలని కోరారు. వందల కోట్ల ప్రజాధనం ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ప్రజలే గమనించాలని సీఎం జగన్ కోరారు.