ఉమ్మడి మేనిఫెస్టోతో అబద్దాలకు రెక్కలు కడుతున్నారు: సీఎం జగన్
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య వార్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 30 April 2024 8:30 PM ISTఉమ్మడి మేనిఫెస్టోతో అబద్దాలకు రెక్కలు కడుతున్నారు: సీఎం జగన్
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య వార్ కొనసాగుతోంది. ప్రచారంలో ఓ వైపు దూసుకెళ్తూనే.. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు నాయకులు. ఏపీలో ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం ఈ మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా మేనిఫెస్టోను విడుదల చేశాయి. పెన్షన్లతో పాటుగా ఇతర హామీలను ఇందులో పొందుపర్చారు. కూటమి మేనిఫెస్టోపై వైసీపీ అధినేత, సీఎం జగన్ స్పందించారు. మేనిఫెస్టోపై విమర్శలు చేశారు.
అన్నమయ్య జిల్లా కలికిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మరోసారి ముగ్గురూ కలిసి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోతో వస్తున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టో పేరుతో మళ్లీ అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని విమర్శించారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇస్తూ.. ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. వారి మాటలను నమ్మితే గతంలో లాగే మరోసారి మోసపోక తప్పదని సీఎం జగన్ అన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారనీ.. ఇవన్నీ నమ్ముతారా? అంటూ సీఎం జగన్ ప్రజలకు సూచించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ అనీ.. ఆయన చెప్పే సాధ్యం కాని హామీలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసని సీఎం జగన్ అన్నారు. 2014లో కూడా ఇలానే చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ మేనిఫెస్టో విడుదల చేశారనీ.. అప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు మేనిఫెస్టో హామీలు అమలుకు సాధ్యం కాదని బీజేపీ అగ్రనేతలకు తెలుసనీ.. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలను పెట్టనివ్వలేదని చెప్పారు. అందుకే చంద్రబాబు తాజాగా తమ ఉమ్మడి మేనిఫెస్టోపై ముగ్గురి ఫొటోలను కూడా పెట్టుకోలేదని విమర్శించారు. ప్రజలను మోసం చేయడానికే ఇదంతా చేస్తున్నారనీ.. గ్రహించాలంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు. వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తానని సీఎం జగన్ అన్నారు.