ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  22 Sep 2023 7:07 AM GMT
Chandrababu Arrest, TDP bycott, AP Assembly Session ,

 ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై రచ్చ కొనసాగింది. ఈ క్రమంలో ఈ పరిణామంపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అంతేకాదు.. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులను చూపిస్తూ ఆందోళన చేశారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో.. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌తో పాటు అధికారపక్షం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ అయితే.. ఏకంగా పలువురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అధికారపక్షం తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ నాయకులు వెల్లడించారు. శనివారం నుంచి శాసనసభ, శాసనమండలికి హాజరుకాబోమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను సజావుగా సాగనివ్వడం లేదంటూ అధికారపక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆందోళనలు చేసింది. రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. గురువారం రోజే 16 మంది టీడీపీ సభ్యులను స్పీకర్‌ సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇక శుక్రవారం కూడా నిరసన తెలిపిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. వీరిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్‌పై చర్చ జరపాలని నిరసన తెలిపితే బహిష్కరిస్తున్నారంటూ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా సస్పెన్షన్‌ వేటు వేయడంతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడం కూడా టీడీపీ నిర్ణయానికి కారణం అయ్యింది. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కానీ.. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు కొనగుతాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

Next Story