చంద్రబాబుని ప్రధాన సూత్రధారిగా సీఐడీ ఎలా పేర్కొంది?

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబునే సూత్రధారిగా పేర్కొంది సీఐడీ.

By Srikanth Gundamalla  Published on  10 Sep 2023 3:36 AM GMT
Chandrababu Arrest, CID, ACB Court, Remand Report,

 చంద్రబాబుని ప్రధాన సూత్రధారిగా సీఐడీ ఎలా పేర్కొంది?

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన అరెస్ట్‌తో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని చోట్ల టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో చంద్రబాబుని హాజరు పర్చారు సీఐడీ అధికారులు. ఈ సందర్భంగా సీఐడీ కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించింది. అందులో చంద్రబాబునే సూత్రధారిగా పేర్కొంది సీఐడీ. చంద్రబాబుతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరును కూడా చేర్చింది. 2021లో పేర్కొన్న ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. తాజాగా ఆయన పేరును చేర్చారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుపై రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించారు.

చంద్రబాబు హయాంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పీవీ రమేష్‌ ఫైనాన్స్‌ సెక్రటరీగా పనిచేశారు. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోనే ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో డొంక మొత్తం కదిలినట్లు తెలుస్తోంది. పూర్తి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో పీవీ రమేశ్ అత్యంత కీలకంగా మారారు. ఫైనాన్స్‌ సెక్రటరీగా ఉన్న సమయంలో పీవీ రమేశ్ సీమెన్స్‌కు నిధులు విడుదల చేసేందుకు నిరాకరించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని వారించారు. ఆ మేరకు సీఎస్‌కు లేఖ కూడా రాశారు. సీమెన్స్‌కి నిధులు రిలీజ్‌ చేయొద్దని సూచించారు. ఇదే విషయాన్ని సీఐడీ విచారణలో స్టేట్‌మెంట్‌గా ఇచ్చారు పీవీ రమేష్‌. పీవీ రమేశ్ స్టేట్‌మెంట్ ఆధారంగానే చంద్రబాబుపై సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.

చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు విడుదల చేసినట్లు సీఐడీకి వాంగ్మూలం ఇచ్చారు పీవీ రమేశ్. దాంతో.. ఈ స్కామ్‌లో సూత్రధారి చంద్రబాబే అని సీఐడీ అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు సూత్రధారిగా రిమాండ్ రిపోర్ట్‌లో సీఐడీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా.. పీవీ రమేశ్ వైసీపీ ప్రభుత్వంలో కూడా పని చేశారు. పుణెలో స్కామ్‌ లింకులు బయట పడ్డాక రమేశ్‌ను సీఐడీ విచారించింది. సీమెన్స్‌ ప్రతినిధులను కూడా విచారించింది. పీవీ రమేష్‌ అప్రూవర్‌గా మారడంతో కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డొల్ల కంపెనీల లింక్‌లు, ఆధారాలు సేకరించింది సీఐడీ. ఈ ఆధారాలను బేస్ చేసుకునే చంద్రబాబు విషయంలో సీఐడీ దూకుడు పెంచింది.

Next Story