Chandrababu Arrest: బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 12:53 PM IST
Chandrababu Arrest: బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుని సీఐడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఆయన రిమాండ్‌లో ఉన్నారు. అయితే.. చంద్రబాబుని బయటకు తీసుకొచ్చేందుకు ఆయన తరఫు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకు ముందు హౌస్ కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేయగా.. దాన్ని విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. చంద్రబాబు బయట ఉంటే ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న సీఐడీ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు.
తాజాగా మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీ ఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులోనూ చంద్రబాబు పేరు లేదని తెలిపారు. ఈకేసులో తన పేరును ఎప్పుడు చేర్చారో కూడా కనీసం చెప్పలేదని చంద్రబాబు కోర్టుకు తెలిపారు. ఏ ఆధారాలంతో తనని అరెస్ట్ చేశారు.. నిందితుడిగా పేర్కొంటున్నారో సీఐడీ వద్ద ప్రాథమిక వివరాలు లేనవి న్యాయస్థానానికి చెప్పారు చంద్రబాబు. రాజకీయ ప్రతీకారంతో దురుద్దేశపూర్వకంగానే తనని కేసులోకి లాగారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఎం ప్రోద్బలంతోనే చంద్రబాబుని ఇరికించారని.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు.
కాగా.. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతలోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్‌పై విచారిస్తే క్వాష్ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు.