రామకుప్పంలో చంద్రబాబు పీఏ సహా 45 మంది టీడీపీ నేతలపై కేసు
రామకుప్పం పోలీస్ స్టేషన్‌లో 45 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు.
By Srikanth Gundamalla Published on 29 Jun 2023 2:05 PM ISTరామకుప్పంలో చంద్రబాబు పీఏ సహా 45 మంది టీడీపీ నేతలపై కేసు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం పోలీస్ స్టేషన్‌లో 45 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ ఆధ్వర్యంలో జూన్ 28న రామకుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో.. టీడీపీ నేతలు తమ విధులకు ఆటంకం కలిగించారని హెడ్‌కానిస్టేబుల్ మణి ఫిర్యాదు చేశాడు. హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు 45 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. దీంట్లో.. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌తో పాటు మరో 44 మంది టీడీపీ నేతల పేర్లను రామకుప్పం పోలీసులు చేర్చారు. కాగా.. రామకుప్పం మండలం ఉనిసిగానిపల్లె మాజీ సర్పంచ్ మాహాదేవి, ఆమె భర్త జయశంకర్‌ను గతవారం కుప్పం కోర్టు దగ్గర రామకుప్పం ఎస్‌ఐ దూషించారని.. ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు జూన్ 28న కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపి ఆందోళన చేశారు.
మరోవైపు టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌పైనా కేసు నమోదు అయింది. భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో టీడీపీ బస్సు యాత్ర చేపట్టింది. సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం రాంపురంలో గత సోమవారం బస్సు యాత్ర కొనసాగింది. ఆ సమయంలో యాత్ర బస్సులో ఉన్న వడ్డే ధనమ్మ, తన సోదరి రామకృష్ణమ్మకు చెప్పు చూపించిందని.. టీడీపీ అధికారంలోకి రాగానే చెప్పుతో కొడతానని బెదిరించిందని వడ్డే రాఘవేంద్ర అనే వ్యక్తి కనగానపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ధనమ్మకు మద్దతుగా పరిటాల శ్రీరామ్‌తో పాటు మరో నలుగురు తన సోదరిని దూషించి.. బెదిరించారని కంప్లైంట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే పరిటాల శ్రీరామ్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఈ రెండు ఘటనల్లోనూ తమపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని టీడీపీ నేతలు అంటున్నారు.