బాపట్ల జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం, టీడీపీ నేతల ఆగ్రహం

బాపట్ల జిల్లా బర్తిపూడి గ్రామంలో అర్ధరాత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

By Srikanth Gundamalla  Published on  7 Dec 2023 5:49 AM GMT
bapatla, ntr statue, demolished, tdp,

బాపట్ల జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం, టీడీపీ నేతల ఆగ్రహం

బాపట్ల జిల్లా బర్తిపూడి గ్రామంలో అర్ధరాత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం తల పగలగొట్టి పరారు అయ్యారు. ఈ సంఘటనపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు సహా పలువురు నేతలు ఖండించారు. అర్ధరాత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని చంద్రబాబు అన్నారు. మహనీయుల పట్ల అగౌరవంగా వ్యవహరించడం వైసీపీ ప్రభుత్వ అహంకారానికి నిదర్శమని చంద్రబాబు అన్నారు. ఈ సంఘటనలో పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. అలాగే.. బాధ్యులను కనిపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ ట్విట్టర్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ సర్కార్‌ ఇలాంటి దశ్చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ స్తానాన్ని విగ్రహాల కూల్చివేతతో వైసీపీ చెరిపివేయలేని అన్నారు. మూడు నెలల్లో కూల్చిన వారితోనే ఎన్టీఆర్ విగ్రహం కూల్చిన చోటే మళ్లీ నిర్మిస్తామని చెప్పారు. జై తెలుగు దేశం.. జోహార్‌ ఎన్టీఆర్‌ అంటూ ట్విట్టర్‌లో లోకేశ్ రాసుకొచ్చారు. మరోవైపు దుండుగులు విధ్వంసం చేసింది విగ్రహాన్ని కాదు అనీ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకను అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సరైన సమయంలో సరైన పద్ధతిలో ప్రజలే వైసీపీ వారికి బుద్ధి చెబుతారని అన్నారు.

Next Story