చంద్రబాబు జాతీయ సంపద, కాపాడుకోవాలి: బండ్ల గణేష్
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం గురించి సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పందించారు. తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 19 Sep 2023 4:43 AM GMTచంద్రబాబు జాతీయ సంపద, కాపాడుకోవాలి: బండ్ల గణేష్
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ పలువురు చెబుతున్నారు. జాతీయ నాయకులు చంద్రబాబుని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో సైతం చంద్రబాబును అరెస్ట్ చేసిన అంశం ప్రస్తావనకు వచ్చింది. అంతేకాదు.. ఇతర దేశాల్లోనూ చంద్రబాబుకి మద్దతుగా నిరసన ర్యాలీలు చేస్తున్నారు. జైల్‌లో చంద్రబాబుతో ములాఖత్ అయ్యిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. టీడీపీతో ఈ సారి ఎన్నికల్లో కలిసి వెళ్తామంటూ ప్రకటించారు. ఇలా ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం గురించి సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పందించారు. తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.
చంద్రబాబు జాతీయ సంపద అని.. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బండ్ల గణేష్ అన్నారు. చంద్రబాబు పేరు చెప్పుకుని ఎంతో మంది బాగుపడ్డారని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వార్త వినగానే తాను ఎంతో బాధపడ్డానని వెల్లడించారు. అయితే.. చంద్రబాబుని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇంట్లో వినాయక చవితి వేడుకలు కూడా జరుపుకోలేదని బండ్ల గణేష్ తెలిపారు. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. ఐటీ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారంటే చంద్రబాబు చలవే అని చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. ఐటీ ఉద్యోగులంతా చంద్రబాబుకి అండగా నిలబడాలని ఈ సందర్భంగా కోరారు. నెలరోజుల పాటు ఉద్యోగాలు మానేసి.. సొంతూళ్లకు వెళ్లి ధర్నాల్లో పాల్గొనాలని కోరారు. హైదరాబాద్‌లో పార్క్‌ల ముందు, రోడ్లపై కాకుండా ఊళ్లలో ఉండే బొడ్రాయిల ముందు కూర్చొని ధర్నాలు చేయాలని బండ్ల కోరారు.
చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఎంతో ఇబ్బంది పడుతున్నారని బండ్ల గణేష్ అన్నారు. దాంతో.. తనకు ఆహారం కూడా తీసుకోవాలని అనిపించడం లేదని చెప్పారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని.. చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ జోస్యం చెప్పారు.