మంత్రి రోజా భర్తపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్

మంత్రి రోజా భర్త సెల్వామణిపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది కోర్టు.

By Srikanth Gundamalla
Published on : 29 Aug 2023 10:50 AM IST

Arrest Warrant,  Roja Husband, selvamani,

మంత్రి రోజా భర్తపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్‌ వారెంట్

ఏపీ పర్యాటక శాఖ మంత్రి, సినీ నటి రోజా కుటుంబానికి షాక్ ఎదురైంది. ఆమె భర్త సెల్వామణిపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది కోర్టు. పరువునష్టం దావా కేసులో చెన్నై కోర్టు అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది.

2016లో ఓ తమిళ చానెల్‌కు సెల్వమణి ఇంటర్వూ ఇచ్చారు. అందులో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తనని కించపరిచేలా ఉన్నాయని సినీ ఫైనాన్షియర్‌ ముకుంద్‌చంద్‌ బోత్రా ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జార్జి టౌన్ కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. విచారణ సమయంలో దర్శకుడు అయిన సెల్వమణి విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ.. ఆయన కోర్టుకు వెళ్లలేదు. దాంతో.. సెల్వమణి వ్యవహారంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కోర్టు తాజాగా అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది. అయితే.. ఇది నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్ కావడంతో సెల్వమణి కుటుంబానికి ఎదురుదెబ్బే అని చెప్పాలి. కాగా.. సెల్వమణి అరెస్ట్‌ వారెంట్‌ నుంచి తప్పించుకోవాలంటే.. కోర్టుకు కచ్చితంగా హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది.సెల్వమణి కోర్టుకు హాజరు అవుతారా? లేదంటే న్యాయవాది ద్వారా కోర్టుకు వస్తారా అనేది ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఇదే చర్చగా మారింది.

ఒక కేసులో ముకుంద్‌చంద్‌ బోత్రా అనే సినిమా పైనాన్షియర్‌ 2016లో అరెస్ట్‌ అయ్యారు. సెల్వమణి తన ఇంటర్వూలో బోద్రా గురించి ఆరోపణలు చేశారు. దాంతో.. అతను సెల్వమణితో పాటు మరొకరిపైనా పరువునష్టం దావా వేశారు. సెల్వమణి వ్యాఖ్యలతో తన పరువుకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కొద్దిరోజులకే బోద్రా మరణించినా.. ఆ తర్వాత కేసుని ఆయన తనయుడు గగన్ కొనసాగిస్తున్నారు. గత ఏడేళ్లుగా కేసు విచారణ కొనసాగుతోంది.

Next Story