సంక్రాంతి కోసం ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్

సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. పట్నంలో ఉన్న ప్రజలంతా తమ సొంతూళ్లకు పయనం అవుతుంటారు.

By Srikanth Gundamalla  Published on  6 Jan 2024 6:42 AM IST
apsrtc, good news,  passengers, pongal, special buses,

 సంక్రాంతి కోసం ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్ 

సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. పట్నంలో ఉన్న ప్రజలంతా తమ సొంతూళ్లకు పయనం అవుతుంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి ఊరెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా పలు నగరాల నుంచి సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. రెగ్యులర్‌గా నడిచే బస్సులతో పాటు 6,795 ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తెస్తామని చెప్పింది. అంతేకాదు.. ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ చార్జీలే ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు 3,570 బస్సులు.. తిరుగు ప్రయాణాల కోసం ఈ నెల 16 నుంచి 18 వరకు 3,225 బస్సులు నడుపుతాని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

కాగా.. హైదరాబాద్‌ నుంచి 1,600 బస్సులు, బెంగళూరు నుంచి 250, చెన్నై నుంచి 40, విజయవాడ నుంచి 300, విశాఖ నుంచి 290, రాజమహేంద్రవరం నుంచి 230, తిరుపతి నుంచి 70, ఇతర ప్రాంతాల నుంచి 790 ప్రత్యేక బస్సు సర్వీసులు ఉండనున్నాయి. ఇప్పటికే రెగ్యులర్ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు పూర్తయ్యాయని ఆర్టీసీ సంస్థ తెలిపింది. ప్రత్యేక బస్సు సర్వీసుల్లో కూడా రిజర్వేషన్లు మొదలు అయ్యాయని అధికారులు తెలిపారు. రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇక ఈ సర్వీసుల్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నా.. సమాచారం కావాలన్నా కాల్‌ సెంటర్‌ 149కి గానీ.. 0866-2570005 నంబరుకు ఎప్పుడైనా ప్రయాణికులు ఫోన్‌ చేయొచ్చని తెలిపారు.

సాధారణంగా పండగ వచ్చిందంటే బస్సు చార్జీలు ఎక్కువగా ఉంటాయి. కానీ.. ఈ సారి అలా చేయడం లేదు. సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. అంతేకాదు.. చార్జీలకు చిల్లర సమస్య లేకుండా యూటీఎస్ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్నీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఫోన్‌పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్‌ స్కాన్‌ చేసి టికెట్లు తీసుకోవచ్చు. ఇక ప్రత్యేక బస్సుల్లో రానుపోనూ రిజర్వేషన్ చేసుకుంటే ఏపీఎస్ ఆర్టీసీ 10 శాతం కూడా రాయితీ కల్పిస్తోంది.

Next Story