గ్రూప్-1 పరీక్ష వాయిదా వార్తలను నమ్మొద్దు: ఏపీపీఎస్సీ చైర్మన్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 25 Feb 2024 9:02 AM GMTగ్రూప్-1 పరీక్ష వాయిదా వార్తలను నమ్మొద్దు: ఏపీపీఎస్సీ చైర్మన్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. 899 గ్రూప్-2 ఉద్యోగాల కోసం ఏపీపీఎస్సీ ఈ పరీక్షను నిర్వహించింది. అయితే.. ఈ పరీక్ష తీరును ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించారు. గ్రూప్-2 పరీక్షకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4.63 లక్షల మంది రాశారని ఆయన వెల్లడించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించినట్లు వెల్లడించారు. పరీక్ష రాసేందుకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అలాగే ఎక్కడా అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకున్నామని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
అయితే.. చిత్తూరు జిల్లాలో ఫేక్ అడ్మిట్ కార్డుతో వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అతని వద్ద నుంచి తయారు చేసిన నకిలీ హాల్‌టికెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే.. అతనికి ఆ హాల్‌టికెట్ ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎక్కడ తయారు చేశారనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇక గ్రూప్-2 ప్రిలిమినరీ ఫలితాలను జూన్ లేదా జులైలో వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు. మరోవైపు గ్రూప్-1 పరీక్షపై కూడా గౌతమ్ సవాంగ్ స్పందించారు. మార్చి 17వ తేదీన గ్రూప్-1 పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. కొందరు గ్రూప్-1 పరీక్ష వాయిదా పడుతుందని ప్రచారం చేస్తున్నారనీ.. ఇలాంటి వార్తలను నమ్మొద్దని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.