పీవీ రమేశ్ స్టేట్‌మెంట్‌తోనే మొత్తం నడవడం లేదు: సీఐడీ వర్గాలు

మాజీ ఐఏఎస్‌ అధికారి వ్యాఖ్యలపై సీఐడీ వర్గాలు వెంటనే స్పందించాయి

By Srikanth Gundamalla  Published on  11 Sep 2023 9:16 AM GMT
AP, Skill Development Scam Case, PV Ramesh, CID,

 పీవీ రమేశ్ స్టేట్‌మెంట్‌తోనే మొత్తం నడవడం లేదు: సీఐడీ వర్గాలు

ఏపీలో పరిస్థితులు హీట్‌ ఎక్కాయి. మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. అయితే.. ప్రస్తుతం చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు సూత్రధారిగా సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్‌ చేశామని చెబుతున్నారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌కు మాజీ ఐఏఎస్‌ పీవీ రమేశ్‌ స్టేట్‌మెంట్‌ కీలకంగా పనిచేశాయని వార్తలు వినిపించాయి. దాంతో.. స్పందించిన పీవీ రమేశ్‌ సీఐడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా ఆయన అన్నీ చూసుకోలేరు.. అకౌంట్లలో ఏం జరుగుతుందో ఆయనకెలా తెలుస్తుందని ప్రశ్నించారు. అంతేకాక.. తప్పు చేసిన అధికారులను వదిలేసి సీఎంగా పనిచేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేస్తారా అంటూ సీఐడీ అధికారులను పీవీ రమేశ్ నిలదీశారు. ఇక తాను అప్రూవర్‌గా మారలేదని.. తాను ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్‌ ఆధారంగానే అరెస్ట్‌ చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పీవీ రమేశ్ అన్నారు. దాంతో.. మాజీ ఐఏఎస్‌ అధికారి వ్యాఖ్యలపై సీఐడీ వర్గాలు వెంటనే స్పందించాయి.

పీవీ రమేశ్‌ ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్‌ ఆధారంగానే కేసు మొత్తం నడవడం లేదని సీఐడీ వర్గాలు స్పష్టం చేశాయి. దర్యాప్తు ప్రక్రియలో పీవీ రమేశ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఒక భాగం మాత్రమే అని.. ఈ కేసులో ఆరోపణలకు సంబంధించి అన్ని రకాల ఆధారాలు సేకరించినట్లు సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. అధికార దుర్వినియోగం సహా నిధుల మళ్లిపునకు సంబంధించి ఆధారాలు ఉన్నట్లు తెలిపాయి. పక్కా ఆధారాలతోనే తాము ఈ స్కీమ్ స్కాం కేసులో ముందుకు వెళ్లినట్లు చెప్పారు. కేసు కోర్టు పరిధిలో ఉందనీ.. ఈ సమయంలో పీవీ రమేశ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయోమయానికి గురి చేసే ప్రయత్నమే అని ఆగ్రహం వ్యక్తం చేశాయి సీఐడీ వర్గాలు. దర్యాప్తు, విచారణను ప్రభావితం చేసే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించాయి.

నిధుల విడుదలలో తన దిగువ స్థాయి అధికారి చేసిన సూచనను పీవీ రమేశ్ పట్టించుకోలేదని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. రూ.371 కోట్లు విడుదల చేసే ముందు.. అంతపెద్ద మొత్తం అమౌంట్ ఒకేసారి విడుదల చేయడం సరికాదని చెప్పారు. అంతే కాకుండా పైలట్‌ ప్రాజెక్టుగా ఒక స్కిల్‌ హబ్‌కు ముందుగా విడుదల చేద్దామని గట్టిగా సూచించారని సీఐడీ వర్గాలు చెప్పాయి. ఎక్కడో గుజరాత్‌లో చూసి వచ్చామనీ, అంతా కరెక్టుగా అనుకోవడం సమంజసంగా లేదని తెలిపారు. పీవీ రమేశ్‌ కింది అధికారి సూచనలు పట్టించుకోకుండా పక్కనపెట్టారని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం స్కామ్‌ కేసులో ఎన్నో అంశాలు ఉన్నాయని చెప్పాయి. పీవీ రమేశ్‌ చెప్పినట్లు హాస్యాస్పదంగానో.. పేలవంగానో కేసును బిల్డ్‌ చేయలేదని సీఐడీ వర్గాలు వివరణ ఇచ్చాయి.

Next Story