విశాఖలో ఎకరా అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు..సీఎం కేసీఆర్‌కు గుడివాడ కౌంటర్
సీఎం కేసీఆర్ ఏపీలో భూముల ధరలను తెలంగాణతో ఎందుకు పోల్చారో తెలియడం లేదన్నారు మంత్రి గుడివాడ
By Srikanth Gundamalla Published on 24 Jun 2023 6:56 AM GMTవిశాఖలో ఎకరా అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు..సీఎం కేసీఆర్‌కు గుడివాడ కౌంటర్
ఇటీవల తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడిన సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఒక్క ఎకరా అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో వంద ఎకరాలు కొనొచ్చని చెప్పారు. ఏపీతో పోలిస్తే తెలంగాణ అన్ని రంగాల్లో ముందుంది అని.. భూముల విలువ అమాంతం పెరిగిపోయిందని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం లేపుతున్నాయి. తెలంగాణ సీఎం వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ కామెంట్స్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు.
సీఎం కేసీఆర్ ఏపీలో భూముల ధరలను తెలంగాణతో ఎందుకు పోల్చారో తెలియడం లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖలో కూడా ఎకరా భూమి అమ్మితో తెలంగాణలో ఏకంగా 150 ఎకరాల భూమి కొనొచ్చని సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మినహా భూముల రేట్లు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయో చెప్పాలని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌తో పోల్చాలంటే ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉందని.. ఇక్కడ తెలంగాణలో కంటే భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయని..ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ రకమైన విమర్శలు చేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా మండిపడ్డారు.
ఇక ఆ తర్వాత ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పైనా మంత్రి గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు రాష్ట్రం అభివృద్ధి బాటలో పరిగెడుతుంటే.. చంద్రబాబు మాత్రం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన పలు కంపెనీలు పారిపోతున్నాయంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని ఫైర్ అయ్యారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ మొదటి స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. వారాహి యాత్రంలో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నారని.. ఉపవాసాలు చేస్తే సీఎం కాలేరని అన్నారు. సీఎం కావాలంటే ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని చెప్పుకొచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్.