విద్యుత్ చార్జీలు దేశం మొత్తం పెరిగాయి..అలాగే ఏపీ కూడా: మంత్రి ధర్మాన
ఏపీలో విద్యుత్ చార్జీలు భారీగా పెరిగాయని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 9:47 AM ISTవిద్యుత్ చార్జీలు దేశం మొత్తం పెరిగాయి..అలాగే ఏపీ కూడా: మంత్రి ధర్మాన
ఏపీలో విద్యుత్ చార్జీలు భారీగా పెరిగాయని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలతో పాటు ఈ అంశంపై అందరూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ చార్జీలపై రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద రావు స్పందించారు. విద్యుత్ చార్జీలు పెరిగిన మాట వాస్తవమే అని చెప్పారు. అయితే.. దేశంలోని ప్రతి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగాయనీ.. ధరల పెరుగుదల అనేది కేంద్రం చేతిలో ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు లబ్ధి చేకూరేలా పథకాలు, ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు రోడ్లు బాగా లేవు అంటూ గుంతలు చూపిస్తున్నాయని అన్నారు. ఏడాది సమయంలో రోడ్లు వేస్తామని చెప్పారు మంత్రి ధ్మాన. స్థూల జాతీయోత్పత్తిలో రాష్ట్రం నాలుగేళ్లలో ప్రగతి సాధించిందని తెలిపారు. గతంలో 14 ఏళ్ల పాటు చంద్రబాబు పాలనలో ప్రగతి ఎక్కడా కనిపించలేదంటూ విమర్శలు చేశారు. టీడీపీ గతంలో జన్మభూమి కమిటీల పేరుతో పేదలకు పథకాలను అందకుండా చేసిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. పేదలందరికీ విద్య, వైద్యం, సంక్షేమం అందించామని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.