శాసనమండలిలో మంత్రి బొత్స, నారా లోకేశ్ మధ్య వాగ్వాదం.. రేప‌టికి వాయిదా..!

AP Legislature sessions.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య

By సుభాష్  Published on  30 Nov 2020 12:00 PM GMT
శాసనమండలిలో మంత్రి బొత్స, నారా లోకేశ్ మధ్య వాగ్వాదం.. రేప‌టికి వాయిదా..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా పోడియం ముందు బైఠాయించారు. శాసనమండలిలో కూడా ఇలాంటి సన్నివేశాలే చోటు చేసుకున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ల మధ్య మండలిలో వాగ్వాదం జరిగింది.

బొత్స సత్యనారాయణ.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై విమర్శనాస్త్రాలు సంధించగా టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం దండగ అని గతంలో చంద్రబాబు అన్నారని.. బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. అలాంటి వ్యాఖ్య‌లు చంద్ర‌బాబు ఎప్పుడు చేశారో చూపించాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. టీడీపీ నేత నారా లోకేష్ మాట్లాడుతూ.. బొత్స తన వ్యాఖ్యలను నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవులకు తాము రాజీనామా చేస్తామని.. లేని పక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. ఎక్కడ ఏ పంట పండుతుందో కూడా లోకేశ్ కు తెలియదన్నారు. ఎక్కడ ఏ పంట పండుతుందో చెపితే తల దించుకుంటానని అన్నారు. ట్రాక్టర్ ఎక్కి ఫోజులు ఇవ్వడం మాత్రమే లోకేశ్ కు తెలుసని.. ట్రాక్టర్ ను బురదగుంటలోకి పోనివ్వడం తప్ప ఏం తెలుసు..? చివరికి ఆ ట్రాక్టర్ ను రైతులతో బయటికి తీయించారు అంటూ లోకేశ్ పై విరుచుకుపడ్డారు. అంతకు మించి మరేం తెలియదని ఎద్దేవా చేశారు.

ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు కూడా దీటుగా స్పందించడంతో మండలిలో గందరగోళం ఏర్పడింది. టీడీపీ సభ్యులు మంత్రి బొత్స వ్యాఖ్యల పట్ల ఆందోళనకు దిగారు. అటు వైసీపీ సభ్యులు కూడా చైర్మన్ పోడియం వద్దకు దూసుకువచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మండలిని రేపటికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ షరీఫ్ ప్రకటించారు.

Next Story