చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ శ్రేణులు: కొడాలి నాని

మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడిని తాను కాదని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

By Srikanth Gundamalla  Published on  22 Aug 2023 2:30 PM IST
AP, Kodali Nani,  Chiranjeevi, Birth Day, YCP,

చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ శ్రేణులు: కొడాలి నాని

మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడిని తాను కాదని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో నిర్వహించిన మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల చిరంజీవి పట్ల చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శలు చేశారు. దాంతో.. ఆయన వివరణ ఇచ్చారు. తాను శ్రీరామ అనే పదం పలికినా టీడీపీ, జనసేన నాయకులకు బూతులాగే వినపడుతోందని కొడాలి నాని అన్నారు. తాను ఏం మాట్లాడారో చిరంజీవి, ఆయన అభిమానులకు తెలుసు అని పేర్కొన్నారు. తామంతా క్లారిటీగా ఉన్నామని ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు.

తాను చిరంజీవిని విమర్శించినట్లు ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు, జనసేన నాయకులు నిరూపించాలని కొడాలినాని సవాల్ విసిరారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ శ్రేణులు ఉన్నారని.. తనకు చిరంజీవికి మధ్య అగాధం సృష్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వెంట ఉన్న 60శాతం మంది చిరంజీవి అభిమానులే అని చెప్పారు కొడాలి నాని. మెగాస్టార్ చిరంజీవి ఎవరి జోలికి వెళ్లరనీ.. ఆయనను విమర్శించే సంస్కారహీనుడు తాను కాదని కొడాలి నాని వివరణ ఇచ్చారు.

అయితే.. సీఎం జగన్‌ను కూడా ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. గుడివాడ రోడ్లపై చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన శ్రేణులు దొర్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రజారాజ్యం తరఫున తన కార్యాలయం మీదుగా చిరంజీవి వెళ్తే చేతులెత్తి నమస్కారం చేశానని గుర్తు చేశారు. చిరంజీవిని అనేక సందర్భాల్లో కలిశానని, పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలను పాటిస్తామని ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. తమకు మెగాస్టార్ చిరంజీవి సలహా ఇచ్చినట్లే.. డ్యాన్సులు, నటన చేతకాని కొందరికి సలహా ఇవ్వాలని చెప్పానన్నారు. ఇండస్ట్రీలో మెగా హీరోగా ఉన్న చిరంజీవికి డ్యాన్స్‌లు, యాక్షన్‌ రాదా? అని తాను వ్యాఖ్యానించలేదని వివరణ ఇచ్చారు. ఇకనైనా విషప్రచారం మానుకోవాలంటూ ఎమ్మెల్యే కొడాలని నాని హెచ్చరించారు.

Next Story