ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞ పూనిన వైఎస్ షర్మిల

ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతిజ్ఞ పూనారు.

By Srikanth Gundamalla  Published on  7 March 2024 9:15 AM GMT
ap congress,  sharmila, pledge,  special status,

ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞ పూనిన వైఎస్ షర్మిల 

ఏపీలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చురుగ్గా పనిచేస్తున్నారు. అధికార పార్టీ వైసీపీతో పాటు.. టీడీపీ, జనసేన పార్టీలపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా తాము పనిచేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా ప్రతిజ్ఞ పూనారు. ఆమెతో పాటు ఇతర రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత ప్రసంగం చేసిన వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాపై భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు.

రాష్ట్రం విడిపోయి పదేళ్లు అవుతోందని షర్మిల అన్నారు. అయినా.. ప్రత్యేక హోదా ఊసే లేదని వ్యాఖ్యానించారు. కొందరు నాయకులు అయితే హోదా అంటే ఏంటో అని వింతగా చూస్తున్నారని షర్మిల చెప్పారు. కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్నది కాంగ్రెస్సే అన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున జరగాల్సిన అవసరం ఉందనీ.. అలా చేయకపోతే అస్సలు సాధించలేమన్నారు వైఎస్ షర్మిల. హోదా విషయంలో మనం పదేళ్లపాటు గొర్రెలు అయ్యామనీ.. అందుకే వారు మనల్ని బలి ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. గొర్రెల్లా కాదు.. మనం ప్రత్యేక హోదా కోసం సింహంలా పోరాటం చేయాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.

ఆంధ్రులను మోసం చేసిన మోదీ ఒక డి ఫాల్టర్‌.. మోడీ ఒక కేడీ అంటూ తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ షర్మిల. హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేదన్నారు. అటు చంద్రబాబుకి.. ఇటు సీఎం జగన్‌కు ప్రత్యేక హోదా గురించి పట్టింపే లేదన్నారు. వ్యక్తిగత రాజకీయాల కోసం తాను ఆంధ్ర రాజకీయాల్లోకి రాలేదనీ.. కేవలం హోదా సాధన, విభజన సమస్యల సాధన కోసమే ఇక్కడ అడుగుపెట్టానన్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు రాష్ట్రమంతా ఉద్యమించాలనీ.. ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్నారు. మరోవైపు రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా ఇప్పటికీ రాజధాని లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. మూడు అంటున్నారు.. ఇప్పటికీ ఒక్కటి పూర్తికాకవపోడం సిగ్గు చేటంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అభివృద్ధిలో ఏపీ 25 ఏళ్లు వెనుకబడిపోయిందని చెప్పారు. రాష్ట్రానికి హోదా సాధించాలన్నా.. అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్‌తోనే సాధ్యమని వైఎస్ షర్మిల అన్నారు.


Next Story