కరోనా అలర్ట్.. ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దాంతో.. ఆయా రాష్ట్రాల్లోని వైద్యాధికారులు అలర్ట్ అవుతున్నారు.
By Srikanth Gundamalla Published on 22 Dec 2023 5:15 PM ISTకరోనా అలర్ట్.. ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దాంతో.. ఆయా రాష్ట్రాల్లోని వైద్యాధికారులు అలర్ట్ అవుతున్నారు. కోవిడ్ పూర్తిగా అంతరించిపోలేదు అనీ.. వివిధ వేరియంట్ల రూపంలో వస్తూ ఉంటుందని చెబుతున్నారు. అందుకే ప్రజలంతా ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కోవిడ్‌పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్-1 విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని వైద్యాధికారులకు సీఎం జగన్ సూచించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఈ కోవిడ్ వేరియంట్ పట్ల ఆందోళన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో ఆస్పత్రుల్లో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని చెప్పారు. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని అధికారులు సీఎం జగన్‌కు చెప్పారు. అయితే.. జేఎన్-1 వేరియంట్ వేగంగా విస్తరించే అవకాశాలు మాత్రం ఉన్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. దాంతో.. ఈ లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయిస్తున్నట్లు చెప్పారు.
కరోనా లక్షణాలు ఉన్నవారికి అన్ని విధాలా అండగా నిలవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్న కారణంగా.. ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్ క్లిన్ వ్యవస్థను ముందస్తు చర్యలు కోసం అలర్ట్ చేయాలని సీఎం జగన్ సూచించారు. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విలేజ్ క్లినిక్స్ స్టాఫ్‌కు అవగాహన కల్పించి.. పూర్తిగా వ్యాప్తి చెందక ముందే అడ్డుకోవాలన్నారు. ఇక ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
ఇక ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయని సీఎం జగన్‌కు అధికారులు చెప్పారు. అవసరమైన మందులు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్‌ఫ్రాను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 56,7441 ఆక్సిజన్ బెడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడించారు.