డిసెంబర్‌లోపు విశాఖకు మారుతా.. ఇక్కడి నుంచే పాలన: సీఎం జగన్
సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన అందించనున్నట్లు వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 8:30 AM GMTడిసెంబర్‌లోపు విశాఖకు మారుతా.. ఇక్కడి నుంచే పాలన: సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. టూర్‌లో భాగంగా విశాఖలోని రుషికొండలో ఏర్పాటు చేసిన ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రెండు ఫార్మా యూనిట్లకు శంకుస్థాపన చేశారు. దీంతో.. 4,160 మందికి ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభించిన తర్వాత సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన అందించనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. డిసెంబర్ వరకు తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు చెప్పారు సీఎం జగన్.
హైదరాబాద్, బెంగళూరు మాదిరిగానే విశాఖలో విస్తారమైన అవకాశాలు ఉంటాయని సీఎం జగన్ అన్నారు. వైజాగ్ కూడా ఐటీ హబ్‌గా మారుతోందని చెప్పారు. విశాఖను ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చామని చెప్పారు సీఎం జగన్. ఇక ప్రతీ ఏడాది 15వేల మంది ఇంజినీర్లు ఇక్కడి నుంచి తయారవుతున్నారని చెప్పారు. అయితే.. ఏపీలోనే విశాఖ అతిపెద్ద నగరమని.. అంతర్జాతీయ విమానాశ్రయం, విస్తారమైన తీరప్రాంతం విశాఖ సొంతమని చెప్పారు. దాంతో విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకు వస్తున్నాయని జగన్ వెల్లడించారు. ఒక్క ఫోన్ కాల్‌తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కల్పిస్తామని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
అంతేకాదు.. తాను కూడా త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు జగన్ చెప్పారు. పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుందని.. విశాఖపట్నం నుంచే పరిపాలన కొనసాగిస్తామని జగన్ అన్నారు. అయితే.. డిసెంబర్ లోపే విశాఖకు మారుతానని.. ఆ తర్వాత విశాఖ నుంచే పాలన కొనసాగుతుందని సీఎం జగన్ చెప్పారు.