ఫోరెన్సిక్ రిపోర్ట్ ఫేక్! మరీ వీడియో?
AP CID key statement on Gorantla Madhav video controversy. ఫేక్.. ఫేక్.. ఫేక్..! సోషల్ మీడియాలో ఫేక్ వీడియో, ఫేక్ రిపోర్టుపై ప్రచారం అదిరిపోతోంది. ఎంపీ గోరంట్ల మాధవ్
By సునీల్ Published on 18 Aug 2022 1:49 PM GMT- ఆర్ఆర్ఆర్ సినిమా తరహాలో గ్రాఫిక్స్
- ఎంపీ గోరంట్ల వ్యవహారంలో మరో మలుపు
- టీడీపీ తెచ్చిన ఎక్లిప్స్ రిపోర్ట్ ఫేక్‌గా తేల్చిన సీఐడీ
- వరుస కౌంటర్లతో వైసీపీ విమర్శలు
ఫేక్.. ఫేక్.. ఫేక్..! సోషల్ మీడియాలో ఫేక్ వీడియో, ఫేక్ రిపోర్టుపై ప్రచారం అదిరిపోతోంది. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో బయటపడిన నాటి నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్న విషయం తెలిసిందే. అది ఒరిజినల్ అని ప్రతిపక్ష టీడీపీ, ఫేక్ అని అధికార వైసీపీ కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ అంటూ ఓ వీడియో రేపిన సంచలనం అంతాఇంతా కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఇది తీవ్ర చర్చనీయాంశం అయింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అది మార్ఫింగ్ వీడియో అని ఎంపీ గోరంట్ల మాధవ్ అంటుండగా, అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయిస్తే అందులో ఉన్నది మాధవ్ అని స్పష్టమైందని టీడీపీ నేతలు అంటున్నారు.
ఆ వీడియో నిజమేనని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ సంస్థ ధ్రువీకరించిందంటూ ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మీడియా ముందుకొచ్చారు. అధికార పార్టీ ఎంపీ న్యూడ్ వీడియో నిజమని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలిందని చెప్పుకొచ్చారు. నిజనిర్ధారణ జరిగింది కాబట్టి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా గ్రూపుల్లోనూ ఇదే విషయంపై భారీగా ప్రచారం జరిగింది. రకరకాల హ్యాష్ ట్యాగ్‌లతో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.
తాజాగా ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆ ఫోరెన్సిక్ సర్టిఫికెటే ఫేక్ అని ప్రకటించారు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య కాల్ అయితే మూడో వ్యక్తి షూట్ చేశాడని, సర్క్యులేట్ అవుతున్నది షూట్ చేసిన వీడియోనే అని స్పష్టం చేశారు. ఆ వీడియోను టెస్ట్ చేసిందంటున్న ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చినట్టు చెబుతున్న రిపోర్టే ఫేక్ అన్నారు. వీడియో ఒరిజనలేనని చెప్పిన ల్యాబ్ రిపోర్ట్ ఒరిజినల్ కాదని ల్యాబ్ అధినేత జిమ్ తేల్చి చెప్పారన్నారు.
'రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని జంతువుల సీన్ కోసం గ్రాఫిక్స్ ఉపయోగించారు. ఆ జంతువుల సీన్లను ఫోన్‌తో వీడియో తీసి పంపినా ఫోరెన్సిక్ ల్యాబ్ ఒరిజనలే అని చెబుతుంది. కానీ అందులోని కంటెంట్ ఒరిజినలో, కాదో చెప్పలేరు. కంటెంట్ నిజమైందో లేదో తేలాలంటే 'ఆర్ఆర్ఆర్' సినిమా ఒరిజినల్ ఫుటేజిని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరిశీలించాల'ని సీఐడీ ఏడీజీ తేల్చి చెప్పారు.
ఇప్పటి వరకు విమర్శలతో విరుచుకుపడిన టీడీపీకి వైసీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. ఆర్ఆర్ఆర్ సినిమా సీన్లతో పోలుస్తూ ఎంపీ వీడియో రిపోర్ట్ ఫేక్ అని సీఐడీ తాజాగా తేల్చేయడంతో వైసీపీ విరుచుకుపడుతోంది. మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్సీ పోతుల సునీత దూకుడు పెంచారు. తప్పుడు బాబు తప్పుడు రిపోర్టులంటూ మండిపడుతున్నారు. సీఐడీ విచారణలో టీడీపీ ప్రచారం ఫేక్ అని తేలడంతో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వేల పోస్టులతో దుమ్ము రేపుతున్నారు. అయితే ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్ట్ ఫేక్ అని తేలింది కానీ లీకైన వీడియో అసలైనదా, కాదా అనేది మాత్రం తేలడం లేదు.