టీటీడీ బోర్డుని రాజకీయ పునరావాసంగా మార్చారు: పురందేశ్వరి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  26 Aug 2023 2:00 PM IST
AP BJP, Purandeswari, TTD Members, CM Jagan,

టీటీడీ బోర్డుని రాజకీయ పునరావాసంగా మార్చారు: పురందేశ్వరి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ప్రకటించింది. 24 మంది సభ్యులతో టీడీటీ పాలక మండలి లిస్ట్‌ను శుక్రవారం సీఎం కార్యాలయం విడుదల చేసింది. అయితే.. పాలకమండలి సభ్యుల ఎంపికపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పేరున్న శరత్‌ చంద్రారెడ్డి, అవినీతి పాల్పడి ఢిల్లీ హైకోర్టు ఎంసీఐ నుంచి తొలగించిన కేతన్‌ దేశాయ్‌ వంటి వ్యక్తులకు టీటీడీ బోర్డులో చోటు కల్పించడం పట్ల పురందేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు, తిరుమల ఆలయ పవిత్రతపై ఏపీ సీఎం జగన్‌కు నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా జగ్ వ్యవహరిస్తున్నారని.. సీఎం జగన్ తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు పురందేశ్వరి. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్టారు.

అంతకుముందు టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఎన్నికపైనా పురందేశ్వరి విమర్శలు చేశారు. టీటీ చైర్మన్ రాజకీయ పునరావాస పదవికారాదు అని అన్నారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారికే చోటు కల్పించాలని చెప్పారు. అలా అయితే.. టీటీడీ చైర్మన్‌ పదవిలో ఉండి న్యాయం చేయగలరని పురందేశ్వరి అన్నారు. అయితే.. తాజాగా టీటీడీ పాలకమండలిలో మొత్తం 24 మంది సభ్యుల్లో ఏడుగురికి మళ్లీ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర రెడ్డి ఈనెల 10వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 15 రోజులకు పాలకమండలి సభ్యులను ప్రభుత్వం ఖరారు చేసింది.వివిధ కులాలు, ప్రాంతీయ సమీకరణలు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ల ప్రతినిధులతో సహా 24 మంది పేర్లను టీటీడీ పాలకమండలికి ఖరారు చేశారు.

Next Story