ఏపీ అసెంబ్లీలో రెండోరోజూ ఆందోళనలు..ఇద్దరు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. అసెంబ్లీలో రచ్చ కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  22 Sept 2023 10:34 AM IST
AP Assembly, Two TDP MLAs, Suspension, YCP,

ఏపీ అసెంబ్లీలో రెండోరోజూ ఆందోళనలు..ఇద్దరు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండో రోజు కూడా అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు. తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశారు. అసెంబ్లీ సమావేశాల రెండోరోజు చంద్రబాబు అరెస్ట్‌ అక్రమం అనే అంశంపై పట్టుబడతామని స్పష్టం చేశారు. అధికారపక్షం ఎంత దుందుడుకుగా వ్యవహరించినా ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. శాసనసభతో పాటు మండలిలో కూడా ఇదే కంటిన్యూ చేస్తామని వెల్లడించారు. స్కిల్‌ డెవల్‌మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ అసెంబ్లీలో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌కు ప్రభుత్వానికి స్పీకర్‌ అనుమతిస్తే తమకూ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయాలని నిర్ణయించారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని.. సీఎం జగన్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలనే అజెండాతోనే సభకు వెళ్లారు. స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని సభలో లెవనెత్తాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది.

చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. అసెంబ్లీలో రచ్చ కొనసాగుతోంది. టీడీపీ సభ్యుల ఆందోళనతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ విజిల్స్‌ వేస్తూ నిరసన తెలిపారు. నిన్న కూడా బాలకృష్ణ మీసం మెలేస్తూ నిరసన తెలపడంతో అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగిన విషయం తెలిసిందే. సైకో పాలన పోవాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. ఆయన అరెస్ట్‌పై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని.. సైకో పాలన నశించాలని నినాదాలు చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.

ఏపీ అసెంబ్లీ నుండి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో మొబైల్ ఫోన్‌లో వీడియోలు తీయడంతో ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయడు, ఎమ్మెల్యే అశోక్‌లను ఈ సెషన్ మొత్తానికి స్పీకర్ సభ నుండి సస్పెండ్ చేశారు.

టీడీపీ సభ్యుల తీరుపై అధికార పార్టీ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్, ఆయన అవినీతిపై చర్చకు తాము సిద్ధమని, అయితే, సభలో రచ్చ చేయాలని టీడీపీ సభ్యులు చూస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌, పాలన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోబోమని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ అంశంపై చర్చ జరుగుతుందని, అందులో టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొనాలని పలువురు మంత్రులు సూచించారు.

Next Story