గుడ్‌న్యూస్..ఏపీలో డ్వాక్రా మహిళల వడ్డీలేని రుణ పరిమితి పెంపు
ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 16 July 2024 6:36 AM ISTగుడ్‌న్యూస్..ఏపీలో డ్వాక్రా మహిళల వడ్డీలేని రుణ పరిమితి పెంపు
ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తుండగా.. మరికొన్నింటిని అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఉన్నతి పథకం కింద డ్వాకా మహిళలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల వరకు ప్రభుత్వం పెంంచింది. కాగా.. గతంలో ఈ రుణాల పరిమితి రూ.2 లక్షలుగా ఉండేది. మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా రూ.50వేల నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందించనుంది.
ఈ పథకాన్ని ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళల అభ్యున్నతి కోసం తీసుకొచ్చారు. తీసుకున్న రుణాన్ని వాయిదా రూపంలో మహిళలు చెల్లిస్తారు. 2024-25 ఏడాదికి సంబంధించి రూ.250 కోట్లను రుణంగా ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ రుణాలను తీసుకున్న మహిళలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి సాధించేలా చూడాలన్నది లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. మరోవైపు ఈ రుణ పరిమితిని రూ.5లక్షల వరకు పెంచడం డ్వాక్రా మహిళలకు మరింత ఊరటనిచ్చినట్లు య్యింది. అయితే.. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణాల మంజూరు ఉంటుంది. ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలని అనుకునేది డ్వాక్రా మహిళల ఇష్టం. ప్రస్తుతం ఉన్న రూ.250 కోట్ల నిధులకు అదనంగా చేరితే రూ.500 కోట్ల మేర రుణాలు.. ఒక్క ఏడాదిలోనే అందించే అవకాశం ఉంటుంది అంటున్నారు.