ఏపీలో రేషన్‌కార్డు లేకున్నా వారందరికీ ఫ్రీగా నిత్యావసరాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. వరదల సంభవించి జనజీవనం స్తంభించి పోయింది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2024 8:00 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. వరదల సంభవించి జనజీవనం స్తంభించి పోయింది. ఇంకా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లను దిగ్బందించాయి. బుడమేరు వాగు ఉగ్రరూపానికి విజయవాడ మొత్తం నీట మునిగింది. విజయవాడలోనూ ఇప్పటికీ వరద నీటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు నుంచి ఇతరత్రా అవసరాల వరకూ ప్రజలంతా ప్రభుత్వంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అందిస్తోన్న ఆహార ప్యాకెట్ల కోసం జనాలు ఎగబడుతున్న అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి. వరద బాధితులకు అండగా ఉండేందుకు ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు పలు కంపెనీలు, స్వంచ్ఛంద సంస్థలు తోచినంత సాయం చేస్తూ.. మేము సైతం అంటూ ముందుకొస్తున్నాయి.
వరద బాధితులకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌరసరఫరాల శాఖ నిత్యావసరాలను పంపిణీ చేయనుంది. సుమారు 2 లక్షల మంది లబ్ధిదారులకు నిత్యాసవరాలను అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొదటగా 179వ వార్డు, 3 గ్రామ సచివాలయ పరిధిలో నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు. ముంపు బాధితులందరికీ నిత్యావసర సరుకులు అందించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో.. అధికారులు అహర్నిశలు పనిచేస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని వరద బాధితులకు 25 కిలోల బియ్యంతో పాటు కిలో కందిపప్పు, లీటర్ వంట నూనె, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిగడ్డలు, 2 కిలోల ఆలుగడ్డలను 2 బ్యాగులుగా చేసి పంపిణీ చేస్తామని చెప్పారు. ముందుగా ఎక్కువ ముంపునకు గురైన ప్రాంతాల్లో పంపిణీ మొదలుపెట్టి.. మిగతా ప్రభావిత ప్రాంతాల్లో పంచనున్నట్టు మంత్రి నాదెండ్ల. దాదాపుగా ఒక్క రోజులోనే నిత్యావసర సరుకుల పంపిణీని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. నిత్యావసరాల కోసం రేషన్ కార్డులు అవసరం లేదనీ.. వరద బాధితులుగా గుర్తించి అందిస్తున్నట్లు చెప్పారు. ఆధార్ కార్డు నమోదు ద్వారా పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.