Andhra Pradesh: ఒక్కో కుటుంబానికి రూ.3వేలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 2 Aug 2024 6:40 AM ISTAndhra Pradesh: ఒక్కో కుటుంబానికి రూ.3వేలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. వరదలతో ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన కుటుంబాలకు రూ.3వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారమే ఉత్తర్వులను జారీ చేసింది. అయితే గత ప్రభుత్వం వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు రూ.2వేల చొప్పున మాత్రమే అందించింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరో వెయ్యి రూపాయలను అదనంగా పెంచి రూ.3వేలను ఒక్కో కుటుంబానికి అందించనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు.. ఇతర సరుకులను కూడా వరద బాధితులకు అందించనుంది ప్రభుత్వం.
రద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పామోలిన్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీ చేయనున్న ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రత్యేక ఆర్థిక సాయం, నిత్యావసరాల సరఫరాకు రూ.15.29 కోట్ల విడుదలకు అనుమతిచ్చింది. అలాగే నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 14 పట్టణాల్లో తాగునీటి సరఫరాకు రూ.14.84 కోట్లు విడుదల చేసింది. భారీ వర్షాలు, వరద ప్రభావిత 8 జిల్లాల్లో ఆహారం, పాలు తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు, వైద్య సేవల కోసం మరో రూ.26.50 కోట్లు మంజూరు చేసింది. 2023 ఖరీఫ్ పంట నష్టం, డిసెంబరులో తుపాను నష్టానికి సంబంధించి రూ.442 కోట్లు, రూ.847.22 కోట్ల చొప్పున విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.