ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్.. సాయంత్రమే పదవీ విరమణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇచ్చింది.
By Srikanth Gundamalla
ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్.. సాయంత్రమే పదవీ విరమణ
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కొంతకాలంగా పోరాటం చేశారు. తాజాగా ఆయన ఫైట్‌కు ఫలితం దక్కింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుని నియమించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు శుక్రవారం ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది ప్రభుత్వం. ఆ తర్వాత కాసేపటికే ఆయనకు పోస్టింగ్ ఇస్తూ సీఎస్ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గతంలో కూడా ఇదే పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం.. మరోసారి తాజాగా అదే పోస్టులో నియామకాన్ని ఇచ్చింది. పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఇదే రోజు ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. రక్షణ వ్యవహారాల పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మొదట కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)ను ఏబీవీ ఆశ్రయించగా.. సస్పెన్షన్‌ను సమర్థించింది. ఇక ఆయన హైకోర్టుకు వెళ్లారు.న్యాయస్థానం సస్పెన్సన్‌ను కొట్టివేసింది. ఇక ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీస్‌లో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని.. ఏబీవీ ఉన్న సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఇక క్యాట్ కూడా ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేసింది. దాంతో.. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.