భూమా అఖిలప్రియ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు
రెండ్రోజులుగా చేస్తున్న భూమా అఖిలప్రియ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 8:52 AM ISTభూమా అఖిలప్రియ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిరాహార దీక్ష చేపట్టారు. రెండ్రోజులుగా చేస్తున్న భూమా అఖిలప్రియ నిరాహార దీక్షను పోలీసులు ఈ ఉదయం భగ్నం చేశారు. నంద్యాలలో చంద్రబాబుని అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దే భూమా అఖిలప్రియ దీక్షకు దిగారు. ఆమెతో పాటు దీక్షలో అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి కూడా నిరవధిక దీక్షలో కూర్చుకున్నారు.దాంతో.. పోలీసులు శనివారం వేకువ జామునే ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లారు. అఖిలప్రియ దీక్షను భగ్నం చేశారు.
దీక్షను భగ్నం చేసిన తర్వాత భూమా అఖిలప్రియను పోలీసులు ఆళ్లగడ్డకు తరలించారు. ఆళ్లగడ్డలోని నివాసంలోకి వెళ్లేందుకు భూమా అఖిలప్రియ నిరాకరించారు. పోలీసుల వాహనంలోనే దీక్ష కొనసాగిస్తానని పట్టుబట్టారు. దాంతో.. ఆళ్లగడ్డ పోలీసులు అఖిలప్రియను, ఆమె సోదరుడు విఖ్యాతరెడ్డిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఇద్దరినీ వారి నివాసానికి తరలించారు. పోలీసుల వ్యవహారంపై మాజీమంత్రి భూమా అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి ఇంటిదగ్గర వదిలేశారని ఆరోపించారు. తమ నిరవధిక నిరాహార దీక్షను ఆపబోమని.. ఇంట్లో అయినా కొనసాగిస్తామని చెప్పారు. అయితే.. తనకు, తన సోదరుడికి అనారోగ్య సమస్యలు వస్తే మాత్రం దానికి నంద్యాల ఎస్పీ, డీఎస్పీ బాధ్యత వహించాలని భూమా అఖిలప్రియ అన్నారు.
మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబుని సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుని 48 గంటల కస్టడీకి అనుమతిచ్చింది. చంద్రబాబుని బయటకు తీసుకొచ్చేందుకు ఆయన తరఫు లాయర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దొరకలేదు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలను సైతం బహిష్కరించిన విషయం తెలిసిందే.