ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్‌పై సీఐడీ విచారణ, చిక్కుల్లో వైసీపీ మాజీ మంత్రులు
గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అక్రమాలను బయటపెడతామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 5:41 AM GMTఆడుదాం ఆంధ్ర, సీఎం కప్‌పై సీఐడీ విచారణ, చిక్కుల్లో వైసీపీ మాజీ మంత్రులు
గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అక్రమాలను బయటపెడతామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు చర్యలను ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో దుర్వినియోగంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీఐడీకి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు మొదలు అయ్యాయి. దాంతో వైసీపీ మాజీ మంత్రులు చిక్కుల్లో పడినట్లు అయ్యింది.
ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో సీఐడీ స్పందించింది. సీఎం కప్ 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమంలో అవకతవకలపై వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రులు ఆర్కే రోజా, ధర్మాన కృష్ణదాస్‌తో పాటు మరో ఇద్దరిపై విచారణ జరిపించాలని ఏడీజీ సీఐడీ రవిశంకర్ అయ్యనార్ విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబును ఆదేశించారు.
గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు రూ.150 కోట్లతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. 47 రోజుల క్రీడోత్సవాలను నిర్వహించింది. డిసెంబర్ 26, 2023న, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో స్పోర్ట్స్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు, ఇది ఫిబ్రవరి 10, 2024న ముగిసింది. ఇందులో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ సీఐడీకి ఫిర్యాదులు అందాయి. ఆడుదాం ఆంధ్రలో ఆటగాళ్లకు అందించించేందుకు నాసిరకం కిట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోయాయి.
ఇక ఆడుదాం ఆంధ్ర జర్సీల కొనుగోళ్ల నుంచి ఆటగాళ్లకు కల్పించిన భోజనంలోనూ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి.ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో ఎవర్ని విజేతలుగా ప్రకటించాలని అప్పటి అధికార పార్టీ నేతలే నిర్ణయించారనే విమర్శలు వచ్చాయి. అయితే నిధుల్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది. ఆడుదాం ఆంధ్ర వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఇటీవల చెప్పారు.