బండారు వ్యాఖ్యలపై దుమారం..మంత్రి రోజాకు పెరుగుతున్న మద్దతు

స్నేహితురాలిగా, సహనటిగా రోజాకు అండగా ఉంటానని చెప్పారు నటి రాధిక.

By Srikanth Gundamalla  Published on  7 Oct 2023 8:01 AM IST
Actress Radhika, minister roja,  tdp leader bandaru,

బండారు వ్యాఖ్యలపై దుమారం..మంత్రి రోజాకు పెరుగుతున్న మద్దతు

ఏపీ మంత్రి ఆర్కే రోజాపై ఇటీవల టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బండారు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు రోజా. మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి రోజా కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ నేపథ్యంలో బండారు వ్యాఖ్యలను చాలా మంది తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి రోజాకు అండగా నిలుస్తున్నారు. తాజగా మంత్రి రోజాకు మద్దతు తెలుపుతూ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా నటి రాధిక ఒక వీడియో చేశారు.

స్నేహితురాలిగా, సహనటిగా రోజాకు అండగా ఉంటానని చెప్పారు నటి రాధిక. గత కొద్దిరోజులుగా ఏపీలో చోటుచేసుకున్న పరిణామాలు తనని ఎంతో బాధించాయని చెప్పుకొచ్చారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయాలను చూస్తే తనకు కోపం వస్తోందని అన్నారు రాధిక. ఓ వైపు మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ పార్లమెంట్‌ బిల్‌ పాస్‌ చేసింది.. దేశం పురోగతి దిశగా ముందుకు సాగుతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి కించపర్చేలా వ్యవహరించడం సబబు కాదని బండారు తీరుని తప్పుబట్టారు నటి రాధిక. మహిళలు రాజకీయాల్లో వస్తున్నారని.. ఈ నేపథ్యంలో ఐక్యంగా ఉంటూ దేశాన్ని సమైక్యంగా నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. గౌరవనీయ వ్యక్తి నుంచి వ్యక్తిగత విమర్శలు చేస్తూ కించపర్చేలా వ్యాఖ్యలు రావడం చాలా అవమానకరమని అన్నారు. మీరు రాజకీయాల కోసం బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? అని నటి రాధిక ప్రశ్నించారు. కాబట్టి అలా అందరినీ ఒకే గాటనకట్టి మాట్లాడొద్దని రాధిక హితవు పలికారు.

ఇలాంటి మాటలతో హింసించాలనుకోవడం దిగజారుడు తనమని.. దీనివల్ల పొందే ప్రయోజనం ఏంటని బండారు సత్యనారాయణను నటి రాధిక ప్రశ్నించారు. ఇది సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యుల చేసి గొప్ప పార్టీ.. ఆ పార్టీలో ఉన్న వారిని అవమానించడం తప్ప మరోటి లేదని అన్నారు. దీన్ని తేలిగ్గా తీసుకోబోను అని.. రోజాకు, మహిళలకు, అండగా ఉంటానని ఎక్స్‌లో షేర్‌ చేసిన వీడియో నటి రాధిక వెల్లడించారు. ఇక నటి రాధిక కంటే ముందు బీజేపీ నాయకురాలు ఖుష్బూ కూడా బండారు వ్యాఖ్యలను తప్పుబట్టారు. మంత్రి రోజాకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

Next Story