'ఆడుదాం ఆంధ్ర' పేరుతో ఏపీలో క్రీడా సంబరాలు: సీఎం జగన్

'ఆడుదాం ఆంధ్ర' పేరుతో ఏపీ వ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

By Srikanth Gundamalla  Published on  15 Jun 2023 6:54 PM IST
Aadudam Andhra, AP Sports, CM Jagan Meeting, YCP

'ఆడుదాం ఆంధ్ర' పేరుతో ఏపీలో క్రీడా సంబరాలు: సీఎం జగన్

'ఆడుదాం ఆంధ్ర' పేరుతో ఏపీ వ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.'ఆడుదాం ఆంధ్ర' పేరుతో ఏపీ వ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై సమీక్ష నిర్వహించిన క్రమంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. అధికారులకు పలు సూచనలు కూడా చేశారు సీఎం జగన్. ప్రతీ ఏడాది ఈ ఆటల పోటీలను నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రం నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగిన క్రికెటర్ అంబటి రాయుడు, కేఎస్‌ భరత్‌ వంటి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే క్రీడలకు మైదానాలను సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామం, వార్డు, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు ఏపీ సీఎం జగన్.

ఈ పోటీల్లో క్రికెట్‌తో పాటు, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో వంటి ఆటలను నిర్వహించాలని చెప్పారు. అంతేకాక మరథాన్‌లు పెట్టాలని.. యోగా, టెన్నీకాయిట్‌, సంప్రదాయ ఆటలనూ ఆడించాలని సీఎం జగన్ సూచించారు. ఆటల పోటీలు నిర్వహించడం ద్వారా టాలెంట్‌ ఉన్న వారు బయటకు వస్తారని చెప్పారు. అప్పుడు భారత్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్‌లోనూ ఏపీ నుంచి టీమ్‌ ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలను మరింత ప్రోత్సహించాలని.. ఇందు కోసం స్కూళ్లలో క్రీడా సామాగ్రిని అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ చెప్పారు. ఈ మేరకు సంబంధింత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో ప్రతి నియోజవకర్గానికి ఒక ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు చేయాలని.. దీని కోసం ప్రణాళికలు రూపొందించాలని సూచించారు ఏపీ సీఎం జగన్. కాగా.. ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈ ఆటల పోటీలు మొత్తం 46 రోజుల పాటు కొనసాగనున్నాయి.

Next Story