ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసానికి యత్నం.. దుర్గిలో 144 సెక్షన్
144 Section Applied in Durgi Village.గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని దుర్గి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు
By M.S.R Published on 3 Jan 2022 7:33 AM GMTగుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని దుర్గి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ ప్రధాన రహదారి పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓ వ్యక్తి సుత్తితో ధ్వంసం చేసేందుకు యత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడకు చేరుకుని విగ్రహ ధ్వంసానికి యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తి మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ యలమంద కుమారుడు కోటేశ్వర్ రావుగా గుర్తించారు. పోలీసులు చేరుకునే లోపే విగ్రహం స్వల్పంగా ధ్వంసమైంది. ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు దుర్గిలో 144 సెక్షన్ విధిచారు. జిల్లా వ్యాప్తంగా పలువురు కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ ఘనటపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. శెట్టిపల్లి కోటేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రెచ్చిపోతున్నారంటూ నారా లోకేశ్ మండిపడ్డారు. దోపిడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తెగబడడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా మహనీయుల విగ్రహాలు కూలగొడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
అచ్చోసిన ఆంబోతుల్లా రెచ్చిపోతున్నారు వైసీపీ నాయకులు. దోపిడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తెగబడటమే కాకుండా ఇప్పుడు ఏకంగా మహనీయుల విగ్రహాలు పగలగొడుతున్నారు.(1/2) pic.twitter.com/fC8NFmjwxP
— Lokesh Nara (@naralokesh) January 2, 2022
మాచర్ల నియోజకవర్గం దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ కార్యకర్త ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ విగ్రహంపై చెయ్యేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అది 6 అడుగుల విగ్రహం కాదని.. అఖండ తెలుగుజాతి ఆత్మగౌరవమని చెప్పారు. ఇది మద్యం మత్తులో జరిగిన ఘటన కాదు. అధికార మత్తులో జరిగిన ఘటన. పల్నాడులో వైసీపీ అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. అధికారం ఉంది కదా అని హద్దు మీరితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారిపై, అందుకు ప్రేరేపించిన వారిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.