బీఆర్ఓకు భారతరత్న ఇవ్వాలన్న ఆనంద్ మహీంద్రా

By సుభాష్  Published on  3 Oct 2020 1:10 PM GMT
బీఆర్ఓకు భారతరత్న ఇవ్వాలన్న ఆనంద్ మహీంద్రా

వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు ఎంతో అర్థవంతంగా, ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. తాజాగా ఆయన సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణాలు చేపట్టే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)ను అభినందనల్లో ముంచెత్తారు. హిమాచల్ ప్రదేశ్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గం అటల్‌ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తులో 9.2 మీటర్ల మేర ఉన్న ఈ సొరంగ మార్గం నిర్మాణంలో బీఆర్‌ఓ కీలక పాత్ర పోషించింది.

ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో బీఆర్‌ఓపై ప్రశంసల వర్షం కురిపించారు. సంస్థలకు భారతరత్న పురస్కారం ఇవ్వొచ్చొ లేదో కచ్చితంగా తెలియదు. సవాళ్లు విసిరే అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ ఎంతో సమర్థవంతంగా సొరంగాన్ని నిర్మించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కు భారతరత్న ఇవ్వాలని పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి-లేహ్‌ జాతీయ రహదారిపై లాహౌల్‌-ప్నిటీ జిల్లాలో రోహ్‌తంగ్‌ పాస్‌ వద్ద 9.2 కిలోమీటర్ల మేర ఈ సొరంగాన్ని నిర్మించారు. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, అత్యధునిక సాంకేతిక వ్యవస్థతో ఈ సొరంగాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో మనాలి-లేహ్ మధ్య 46 కిలోమీటర్ల దూరం తగ్గింది.Next Story
Share it