రేపు ఏం జరగనుంది.. భూమిపైకి దూసుకువస్తోన్న భారీ 'గ్రహశకలం'
By సుభాష్ Published on 17 Dec 2019 7:55 PM ISTఒక పెద్ద పిరమిడ్ పరిమాణం కలిగిన గ్రహశకలం రేపు ఉదయం భూమి వైపు రానున్నది. కన్ను మూసి తెరిచేలోపు భూమి దగ్గరగా ఇలా వచ్చి.. అలా వెళ్లనున్నది. గ్రహశకలం భూమి మీద పడుతుందేమోనని మనందరం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ గ్రహశకలం వల్ల మన భూమికి ఎలాంటి నష్టం వాటిల్లదని నాసా పేర్కొంది. గ్రహశకలానికి 2019 ఎక్స్ ఎఫ్ గా నామకరణం చేశారు. భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 18న తెల్లవారుజామున గ్రహ శకలం భూమికి దగ్గరగా రానున్నది.
దాదాపు 54,000 వేల ఎమ్ పిహెచ్ వేగంతో గ్రహశకలం భూమి దగ్గరిగా దూసుకువస్తోంది. భూమికి, చంద్రుని మధ్య ఉండే దూరం కంటే 9.3 రెట్లు ఎక్కువ దూరంలో ఉంటుంది. 2008 సంవత్సరంలో కూడా ఈ గ్రహశకలం భూమికి చాలా దగ్గరగా వచ్చింది. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ నివేదిక ప్రకారం.. గ్రహశకలం 2019 ఎక్స్ ఎఫ్ ప్రతి 573 రోజులకు ఒకసారి సూర్యున్ని చుట్టి వస్తున్నది. మన భూమి 365 రోజులకు ఒకసారి సూర్యుడిని చుట్టి వస్తోంది. ఎక్కువగా వీనస్, మెర్క్యూరీ గ్రహల వద్ద తిరిగే ఈ గ్రహశకలం అప్పుడు భూమిని దగ్గరికి వచ్చి పలకరించి వెళ్తుంటుంది. ఈ గ్రహశకలం 2018 సంవత్సరంలో కూడా భూమిని పలకరించి వెళ్లింది. అప్పుడు భూమికి 31 మిలియన్ మైళ్ల దూరంలో సందడి చేసింది.
గత నెల 25వ తేదీని ఈ గ్రహశకం భూమి దగ్గరికి వస్తున్నదని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. గరిష్ట ఖచ్చితత్వం, కక్ష్య మార్గం ఆధారంగా దాని దిశను నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ గ్రహ శకలం తరచుగా భూమి దగ్గరికి వస్తుందని, అయితే దీని వల్ల భూమికి ఎలాంటి అపాయం లేదని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.