అమృతకు అస్వస్థత.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

By Newsmeter.Network  Published on  10 March 2020 3:34 AM GMT
అమృతకు అస్వస్థత.. ఇంతకీ ఏం జరిగిందంటే..!

ప్రణయ్‌ సతీమణి అమృత తీవ్ర అస్వస్థతకు గురైంది. సోమవారం రాత్రి ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను 108 ద్వారా చికిత్స నిమిత్తం మిర్యాలగూడెలోని ఓ ప్రైవేట్‌ ఆస్ప్రతికి తరలించారు. అమృత తండ్రి మారుతీరావు ఆదివారం పాయిజన్‌ సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమృతపై బెంగతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. కాగా మారుతీరావు మరణించిన రూంలోసూసైడ్‌ నోట్‌ను పోలీసులు గుర్తించారు.

ఇందులో గిరిజ(మారుతీరావు భార్య) నన్ను క్షమించు అంటూనే అమృత అమ్మ దగ్గరికి వెళ్లు అని రాసి ఉంది. ఇది మారుతీరావు రాతేనని పోలీసులు, కుటుంబ సభ్యులు గుర్తించారు. కాగా సోమవారం మారుతీరావు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత అమృత తన తండ్రిని చివరి చూపు చూసేందుకు పోలీసుల భద్రత కోరింది. కాగా తల్లి, బాబాయ్‌ ఇందుకు అభ్యంతరం చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

దీంతో ఆమె వెనక్కు తగ్గింది. మళ్లీ తన బాబాయ్‌ శ్రవణ్‌ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అమృతను తాము రావద్దని అనలేదని పేర్కొన్నాడు. దీంతో మారుతీరావు అంత్యక్రియలు జరిగిన మిర్యాలగూడెలోని హిందూ స్మశాన వాటిక వద్దకు అమృత పోలీసుల భద్రతతో తన తండ్రిని చివరిసారిగా చూసేందుకు వెళ్లింది. అక్కడ ఆమెను మారుతీరావు కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. గోబ్యాక్‌ అమృత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉధ్రిక్తత పరిస్థితి నెలకొనడంతో తండ్రిని ఆఖరి చూపు చూడకుండానే అమృత వెనుదిరిగింది.

అనంతరం ఆమె మీడియా సమావేశం నిర్వహించి తన బాబాయ్‌ శ్రవణ్‌ నుంచి అమ్మకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను అమ్మదగ్గరకు వెళ్లనని, అమ్మ నా దగ్గరకు వస్తే చూసుకొనే బాధ్యత నాదని తెలిపింది. విలేకరుల సమావేశం అనంతరం సాయంత్రం సమయంలో పలు చానెల్స్‌ వారు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో అమృత ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది.

ఆమెను హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నీరసంగా ఉండటం వల్ల అమృత స్పృహ తప్పిపడిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా అమృత తండ్రి మరణించిన వార్త తెలిసిన దగ్గర నుండి బాధతోనే ఉంటుందని, పైకి గంభీర్యంగా ఉన్నా లోలోన బాధపడుతుందని ప్రయణ్‌ కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు తెలిసింది.

Next Story