అమరావతిపై ట్వీట్ల యుద్ధం

By Newsmeter.Network  Published on  28 Nov 2019 6:37 AM GMT
అమరావతిపై ట్వీట్ల యుద్ధం

వైసీపీ ప్రభుత్వ దిగ్గజం, కీలక మంత్రి బొత్స సత్తిబాబు అమరావతిని శవాల దిబ్బగా, స్మశానంగా వర్ణించిన నాటి నుంచీ విపక్ష తెలుగుదేశానికి ఒక ఆయుధం దొరికింది. ప్రజారాజధానిని పనికి రాకుండా చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందంటూ విరుచుకుపడుతోంది. ఇందుకు ప్రజా మద్దతు కూడగట్టేందుకు ట్విట్టర్ యుద్ధానికి, సోషల్ మీడియా సమరానికి తెర తీసింది.

తాజాగా అమరావతి ప్రజా రాజధాని అని అది సంపదను సృష్టిస్తుందని, ఉపాధి కల్పిస్తుందని చెప్పే పోస్టర్లను ట్వీట్ చేసింది. సేవ్ అమరావతి – ది పీపుల్స్ క్యాపిటల్ అన్న హ్యాష్ టాగ్ తో ఈ ట్వీట్ ప్రచార యుద్ధం మొదలైంది. ఇంకో పోస్టర్ లో ఆంధ్రుల రాజధానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులపై ఎందుకింత కక్ష జగన్ గారూ అంటూ ఇంకో పోస్టర్ విషణ్ణ వదనంతో చేతులు జోడించిన ఒక రైతు చిత్రంతో వెలువడింది. డోన్ట్ కిల్ అమరావతి, బిల్డ్ అమరావతి అంటూ ఒక పోస్టర్, అమరావతి స్మశానం కాదు. అది అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అని ఇంకో పోస్టర్ ఇంటర్ నెట్ లో దుమారం రేపుతున్నాయి. ఇసుక ఇష్యూ క్రమేపీ మూలన పడుతున్న సమయంలో తెదేపాకు అమరావతి ఆయుధం దొరికింది.

ఇటీవలే ఇండియా మ్యాపులో అమరావతికి చోటు దక్కింది. మోదీ ప్రభుత్వం ఈ మేరకు దేశం అధికారిక మ్యాపులను సవరించింది. దీన్ని కూడా తెదేపా పూర్తిగా వాడుకోవాలనుకుంటోంది. వైకాపా అమరావతిని మ్యాపులో పెట్టించలేనంత అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతోందని, తెదేపా అభ్యర్థన మేరకే మోదీ ఈ మ్యాపులను మార్చారని కూడా చెప్పుకుంటోంది. ఈ సందర్భంగా తాము వాడుకుని వదిలేసిన మోదీ కృపాకటాక్ష వీక్షణాలను పొందేందుకు అభినందనలతో కూడిన ట్వీట్లు కూడా చేసింది. మొత్తం మీద అమరావతి చుట్టూ అల్లుకుని ఉన్న రియల్ ప్రయోజనాలను కూడా కాపాడాల్సిన బాధ్యతను, అమరావతిని ఒక గ్రోత్ ఇంజన్ గా పెంపొందించాల్సిన బాధ్యతను తెదేపా తన నెత్తిన వేసుకుందన్న మాట. ఇక వైసీపీ తదుపరి ఎత్తుగడ ఏమిటో వేచి చూడాల్సిందే.

Next Story
Share it