అమితాబ్ కు...  అత్యున్న‌తమైన దాదాసాహెబ్ ఫాల్కే పుర‌స్కారం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2019 6:54 AM GMT
అమితాబ్ కు...  అత్యున్న‌తమైన దాదాసాహెబ్ ఫాల్కే పుర‌స్కారం..!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. భారత సినీ రంగంలో అత్యున్నత సేవలు అందించిన వారికి అందించే ఈ అత్యుత్తమ పురస్కారం ఈ ఏడాదికి గాను అమితాబచ్చన్ కు ఇవ్వబోతున్నట్లుగా కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. గత 60 ఏళ్లుగా భారత సినీ పరిశ్రమకు సేవలందిస్తున్న అమితాబచ్చన్ కు ఈ పురస్కారం ఇవ్వబోతున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అమితాబ్ ను ఈ పుర‌స్కార క‌మిటీ ఏక‌గ్రీవంగా ఎంపిక చేసింది. ఈ సంద‌ర్భంగా అమితాబ్ గురించి క్లుప్తంగా మీ కో్సం...

ఉత్త‌రప్ర‌దేశ్ లోని అల‌హాబాద్ లో 1942వ సంవ‌త్స‌రంలో అక్టోబ‌ర్ 11న జ‌న్మించారు. తండ్రి హ‌రివంశ‌రాయ్ బ‌చ్చ‌న్. ప్ర‌ముఖ హిందీ క‌వి. త‌ల్లి తేజీ బ‌చ్చ‌న్. అమితాబ్ కు చిన్న‌ప్ప‌టి నుంచి నట‌న అంటే ఎక్కువ మ‌క్కువ‌. కాలేజీలో చ‌దువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ తో క‌లిసి నాట‌కాల్లో న‌టించేవారు. అమితాబ్ ఫ్యామిలీ అల‌హాబాద్ నుంచి ఢిల్లీకి మకాం మార్చారు. అప్పుడు అమితాబ్ ఆలిండియా రేడియ‌లో అనౌన్స‌ర్ ఉద్యోగానికి ప్ర‌య‌త్నిస్తే... నీ గొంతు బాలేదు అని చెప్పి ఉద్యోగం ఇవ్వ‌లేద‌ట‌.

ఆత‌ర్వాత క‌ల‌క‌త్తా షిప్పింగ్ కంపెనీలో జాయిన్ అయిన‌ప్ప‌టికీ ఆ.. ఉద్యోగం సంతృప్తి ఇవ్వ‌లేద‌ని చెప్పి రాజీనామ చేసి... త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన సినిమాల్లో న‌టించేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. 1968లో ముంబాయికి వ‌చ్చి సినిమా ఆఫీస్ లు చుట్టూ తిరిగి న‌ట‌న పై త‌న‌కున్న మ‌క్కువ‌ను తెలియ‌చేస్తూ... ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడిగితే... ద‌ర్శ‌క‌నిర్మాత‌లు... నువ్వు హీరోవా..? అస‌లు ప‌నికిరావు పో అనే వార‌ట‌. ఆ.. క్ష‌ణంలో చాలా బాధ క‌లిగినా.. మౌనంగా భ‌రించేవార‌ట అమితాబ్.

1969లో కేఏ అబ్బాస్ అమితాబ్ కు తొలి అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సాత్ హిందుస్తానీ అమితాబ్ తొలి సినిమా. ఏడుగురులో ఒక‌రిగా న‌టించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల్ అయినా అమితాబ్ కు బాగా హైలైట్ అవ్వ‌డంతో మంచి గుర్తింపు వ‌చ్చింది. రెండో సినిమా ఆనంద్. ఈ సినిమా 1971 లో రిలీజైంది. రాజేష్ ఖన్నాతో కలసి న‌టించిన‌ అమితాబ్ ఆ సినిమాలో వైద్యునిగా నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకుగానూ ఉత్తమ సహాయ నటునిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.

ఆ తరువాత 1971లో రిలీజైన‌ పర్వానా సినిమాలో మొదటిసారిగా ప్రతినాయకునిగా నటించారు. ఈ సినిమా తరువాత రేష్మా ఔర్ షేరా లో కూడా విలన్ పాత్రే పోషించారు. ఈ సమయంలోనే గుడ్దీ సినిమాలో అతిథిపాత్రలో నటించారు. బావర్చి సినిమాలో కూడా ఒక ప్రత్యేక పాత్ర చేశారు. 1972లో ఎస్.రామనాధన్ దర్శకత్వం వహించిన బాంబే టు గోవా సినిమాలో నటించారు. జంజీర్, దీవార్ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పరుచుకున్నారు.

1975 బాలీవుడ్ చరిత్రలోనూ, అమితాబ్ కెరీర్ లోనూ అత్యంత భారీ విజ‌యాన్ని అందించిన సంవత్సరం. ఆ సంవత్సరంలో అమితాబ్ నటించిన దీవార్, షోలే సినిమాలు భారతీయ సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ మలుపు. యశ్ చోప్రా దర్శకత్వం వహించిన దీవార్ సినిమాలో శశికపూర్, నిరూపా రాయ్, నీతూ సింగ్ లతో నటించారు అమితాబ్. ఈ సినిమాలోని నటనకుగానూ ఫిలింఫేర్ ఉత్తమ నటుని అవార్డు అందుకున్నారాయన.

బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద హిట్ గా నిలిచిందీ చిత్రం. ఇండియా టైంస్ ఈ సినిమాను తప్పక చూడాల్సిన బాలీవుడ్ 25 చిత్రాల జాబితాలో ఒకటిగా పేర్కొంది. ఆగస్టు 15న విడుదలైన షోలే సినిమా 1975 సంవత్సరానికే కాక, మొత్తం భారతదేశంలోనే అతి ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇలా... ఎన్నో సంచ‌ల‌న చిత్రాల్లో న‌టించిన అమితాబ్ తన పాత్రలతో భారతదేశపు చలనచిత్ర పరిశ్రమలో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు.

అనతికాలంలోనే బాలీవుడ్‌లో షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే బిరుదులను పొందారు. నాలుగు దశాబ్దాల్లో దాదాపు 200 సినిమాలలో ఆయన నటించి, మెప్పించారు. 1970, 80, 90లలో తెర పై అమితాబ్ ఆధిపత్యం కొనసాగింది. అప్పట్లో ఫ్రెంచి దర్శకుడు ఫ్రాంన్సిస్ ట్రుఫట్ భారతీయ సినిమాని వన్ మాన్ ఇండస్ట్రీగా అభివర్ణించారు అంటే అమితాబ్ ఎంత‌గా ఆక‌ట్టుకున్నారో అర్ధం చేసుకోవ‌చ్చు.

వెండితెర మీదే కాకుండా బుల్లితెర పై కూడా సంచ‌ల‌నాలు సృష్టించారు అమితాబ్. 2000లో అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి (కెబిసి) మొదటి సీజన్ కు యాంకర్ గా వ్యవహరించారు. ఈ షో చాలా పెద్ద హిట్ అయింది. ఇదో సంచ‌ల‌నం. న‌టుడుగానే కాకుండా నిర్మాత‌గా, బిజినెస్ మ్యాన్ గా, యాంక‌ర్ గా, సింగ‌ర్ గా...ఇలా త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో విజయం సాధించి ఎంద‌రికో స్పూర్తిగా నిలిచిన మ‌హాన‌టుడు అమితాబ్.

వీట‌న్నింటికీ మించి ఆయ‌న గొప్ప మావ‌న‌తావాది. ఆంధ్రప్రదేశ్ లో అప్పులు తీర్చలేక, నష్టాల్లో మునిగిపోయిన 40మంది రైతుల అప్పు తీర్చారు. ఇటీవ‌ల‌ విదర్భకు చెందిన 100 రైతుల అప్పులు తీర్చారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ తరువాత జరిగిన అల్లర్లలో మరణించిన ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సుభాష్ చంద్ తోమర్ కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇలా ఆయ‌న ఎన్నో మంచి ప‌నులు చేసారు.. చేస్తూనే ఉన్నారు. అందుక‌నే అమితాబ్ కు అత్యున్న‌తమైన దాదాసాహెబ్ ఫాల్కే పుర‌స్కారం అని ప్ర‌క‌టించ‌గానే... ప్ర‌తి ఒక్క‌రు మ‌న‌స్పూర్తిగా ఆనందిస్తూ... అభినందిస్తున్నారు. ద‌టీజ్... అమితాబ్..!

Next Story