యూనియన్ మినిస్టర్ అమిత్ షా.. సిఏఏకు మద్దతుగా హైదరాబాద్ లో తలపెట్టాలని చూస్తున్న ర్యాలీకి హైదరాబాద్ పోలీసులు అనుమతిని ఇచ్చారు. మార్చి15న హైదరాబాద్ లోని ఫతే మైదానం వరకూ ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. సిఏఏకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించుకుంటామని ఇప్పటికే పలువురు నాయకులు హైదరాబాద్ పోలీసులను కోరారు.. కానీ అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. తాజాగా అమిత్ షా ర్యాలీకి అనుమతి ఇవ్వడంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం మార్చి 14న హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ బీజేపీ విభాగం అమిత్ షా టూర్ ను, సిఏఏకు మద్దతుగా హైదరాబాద్ లో తలపెట్టే ర్యాలీని విజయవంతం చేయాలని భావిస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా మొదలుపెట్టింది. సిఏఏ కు మద్దతు తెలుపుతున్న ముస్లిం బీజేపీ నాయకుల గళం వినిపించాలని అమిత్ షా యోచిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. సిఏఏ వలన భారత్ లోని ముస్లింలకు ఎటువంటి నష్టం జరగదని తెలియజేయడానికే ఈ ర్యాలీ అని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తోంది. సిఏఏకు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించుకుంటామని తాము అడిగినా ఎందుకు ఇవ్వలేదని తెలంగాణ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పొలిటికల్ గా ఒత్తిడి కారణంగానే తెలంగాణ పోలీసులు సిఏఏ మద్దతు ర్యాలీకి అనుమతి ఇచ్చారంటూ ఆరోపిస్తున్నారు.

సాధారణంగా శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి అనుమతించరు కానీ.. అమిత్ షా సభకు మాత్రం అనుమతిస్తారా..? ఆరోజును ‘బ్లాక్ డే’ గా పిలుపునిస్తున్నారు మరికొందరు..! హైదరాబాద్ కు చెందిన మహిళల బృందం తాము మార్చి-15న హైదరాబాద్ లో సిఏఏకు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ చేసుకోబోతున్నామని.. అందుకు సంబంధించిన పేపర్లను తాము సబ్మిట్ చేయబోతున్నామని చెప్పారు. పోలీసులు తమకు పర్మిషన్ ఇస్తారా..? ఇవ్వరా..? అది కూడా చూస్తామని అంటున్నారు. సిఏఏ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ముస్తాక్ మాలిక్ మాట్లాడుతూ “అమిత్ షా ర్యాలీకి ఎలా తెలంగాణ పోలీసులు అనుమతి ఇచ్చారో ఇప్పటికీ అర్థం కాలేదు. శాంతియుతంగా తాము నిరసన వ్యక్తం చేస్తామన్నా కూడా అనుమతి ఇవ్వలేదు.. కానీ పెద్ద పెద్ద వాళ్లకు మాత్రం ఇచ్చేస్తారా.. న్యాయ వ్యవస్థ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉందా..?” అని ప్రశ్నించారు. శాంతియుతంగా గత పది రోజులుగా సాయంత్రం 7 గంటల నుండి 7:15 వరకూ లైట్స్ ఆఫ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్నామని.. కానీ మీర్ చౌక్ పోలీసులు ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వారి కనెక్షన్లు తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని ముస్తాక్ మాలిక్ చెబుతున్నారు. శాంతియుతమైన నిరసనను కూడా అణచివేయాలని పోలీసులు భావిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.