యాంటీ అబార్షన్ మూవ్ మెంట్ కి బుల్లి మేయర్ సపోర్ట్

By రాణి  Published on  27 Dec 2019 1:08 PM GMT
యాంటీ అబార్షన్ మూవ్ మెంట్ కి బుల్లి మేయర్ సపోర్ట్

ముఖ్యాంశాలు

  • టెక్సస్ గౌరవ మేయర్ పదవిలో చార్లీ మెక్ మిలన్
  • చార్లీ మెక్ మిలన్ 7 నెలల బాలుడు
  • వేలంలో టైటిల్ ని కొనుక్కున్న చార్లీ తల్లిదండ్రులు
  • చార్లీ ప్రచారంతో యాంటీ అబార్షన్ మూవ్ మెంట్ కి బలం
  • అమెరికాను దయగలిగిన దేశంగా మార్చాలని నినాదం

టెక్సస్ : బుల్లి మేయర్ గారికి బ్రేక్ ఫాస్ట్ రెడీ అంటూ ఛాడ్ మెక్ మిలన్ లివింగ్ రూమ్ లో నాన్సీ మెక్ మిలన్ సన్నగా పాటలు పాడుతూ తన చిన్నారి పాపడికి టిఫిన్ తినిపిస్తోంది. “ఇవాళ్టి బ్రేక్ ఫాస్ మెనూ ఏంటంటే ఒక బాటిలో వెచ్చటి పాలు, కాస్త మెత్తమెత్తగా ఉండే సూప్” ఇది తను పాడుతున్న పాటలో రెండో లైన్.

ఛార్లీ మెక్ మిలన్ సాధారణమైన అధికారి కాదు. ఏడు నెలల వయసులో అమెరికాలో అబార్షన్లకు వ్యతిరేకంగా జురుగుతున్న ఉద్యమానికి రథ సారధి తనిప్పుడు. “అమెరికాను మళ్లీ దయకలిగిన దేశంగా మార్చండి” అనే స్లోగన్ తో అబార్షన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ప్రచారం కల్పించడంకోసం అక్టోబర్ లో ఈ చిన్నారి పాపడిని టెక్సస్ గౌరవ మేయర్ గా నియమించారు. వారసత్వం, దత్తత, జీవితం అనే మూడు అంశాలకు సంబంధించి తన ప్రమేయం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేస్తున్నాడీ ముద్దులు మూటగట్టే మొహంతో బోసి నవ్వులు బుడత.

అమెరికాలో అబార్షన్లకు చట్టబద్ధత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమాన్ని ముందంజలో ఉండి నడిపిస్తున్న ఘనత అతి చిన్నవయసులో చార్లీకి దక్కింది. 46 సంవత్సరాల రో వర్సెస్ వేడ్ కేసులో సుప్రీంకోర్ట్ అబార్షన్ కి చట్టబద్ధత కల్పిస్తూ వెలువరించిన తీర్పుకు వ్యతిరేకంగా అమెరికాలో విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోందిప్పుడు. అబార్షన్ చేయించుకుని కడుపులోనే బిడ్డ ప్రాణాన్ని బలిచేయడంకంటే బిడ్డను కని ఇష్టమైనవాళ్లకు పెంచుకోవడానికి దత్తతకు ఇవ్వడం చాలా మంచిదన్న అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో కల్పించేందుకు చేపట్టిన ఉద్యమమే ఇది.

చార్లీని దత్తతు చేసుకున్న మెక్ మిలన్ దంపతులు

నిజానికి చార్లీని నాన్సీ మెక్ మిలన్ దత్తత తీసుకుంది. తను ఆమెకు జన్మనిచ్చిన తల్లికాదు. ఛార్లీ తల్లి అబార్షన్ చేయించుకునే స్థితిలో లేక తప్పనిసరి పరిస్థితిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ స్థితిలో ఆమెకు చాలామంది అండగా నిలిచారు. బిడ్డ పుట్టిన తర్వాత నాన్సీ మెక్ మిలన్ తనను దత్తత తీసుకుంది. చార్లీ తల్లిదండ్రులు ఫైర్ ఫైటర్స్ కోసం నిధుల్ని సమీకరించేందుకు జరిపిన వేలంలో గౌరవ మేయర్ టైటిల్ ను సొంతం చేసుకున్నారు. తమ బిడ్డను గొప్పగా చూసుకోవాలన్న ఆకాంక్షతో తాము ఈ పని చేశామని, చార్లీకి గౌరవ మేయర్ పదవి ఇప్పించామనీ అంటున్నారు. తర్వాత చార్లీ చిరునవ్వు నగరంలో చాలామందిని సమ్మోహితుల్ని చేస్తోందన్న విషయాన్ని నాన్సీ మెక్ మిలన్ గుర్తించింది. ఈ దశలో అబార్షన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి చార్లీని అంబాసిడర్ గా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆమెకు కలిగింది. వెంటనే ఆమె ఆ ఆలోచనకు కార్యరూపమిచ్చింది. ఇంకేముంది చార్లీ బోసి నవ్వుల ముద్దుమోము పుణ్యమా అని ఆ ఉద్యమానికి విస్తృతమైన ప్రచారం లభిస్తోంది.

హ్యూస్టన్ ప్రెగ్నెన్సీ హెల్ప్ సెంటర్ డెవలప్ మెంట్ బోర్డ్ లో చార్లీ తల్లిదండ్రులు సభ్యులు. అనుకోని పరిస్థితుల్లో గర్భం ధరించిన మహిళలు అబార్షన్ చేయించుకోకుండా పిల్లల్ని కని, వాళ్లను వేరే ఎవరికైనా దత్తత ఇచ్చేలా ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది. అందుకు కావాల్సిన సహాయాన్ని అన్ని విధాలుగా అందజేస్తుంది.

పార్టీలకు అతీతం

ఒక మంచిపనికోసం చేసే ఈ గౌరవ నియామకాన్ని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు అందరూ గౌరవిస్తారు. డిసెంబర్ 15వ తేదీన అందరూ కలసి ఆడి పాడి సంబరాలు చేసుకుంటూ చార్లీని మేయర్ పదవిలో కూర్చోబెట్టారు. తనని కార్యాలయానికి తీసుకెళ్లి ప్రమాణ స్వీకారం చేయించారు. అబార్షన్ ని చట్టబద్ధం చేయడంవల్ల వివక్ష చాలా పెరిగిపోతుందనీ, భవిష్యత్తులో మహిళల సంఖ్య తగ్గిపోతుందనీ, సామాజిక అసంతులనం ఏర్పడుతుందనీ అమెరికాలో న్యాయవాదులు గట్టిగా వాదిస్తున్నారు. మిగతా దేశాలతో పోలిస్తే దీనికి సంబంధించి అమెరికాలో వెసులుబాట్లు కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. ఇప్పుడా వెసులుబాట్లను సడలించి అబార్షన్ చేయించుకోవడానికి వీల్లేకుండా చట్టాల్ని మార్చాలన్నది వారి డిమాండ్. రాజకీయ పోరాటాలు దేశాన్ని రెండు ముక్కలు చేస్తే తన బిడ్డ చార్లీ ఒక మంచి కారణంతో మొత్తంగా దేశాన్నంతటినీ ఒక్కటి చేశాడని తండ్రి చాడ్ మెక్ మిలన్ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. పార్టీలు, వర్గాలతో పనిలేకుండా అందరూ కలసి ఒక్కతాటిమీద నిలబడి చేస్తున్న పోరాటాన్ని తన బిడ్డ ముందుండి నడిపించడం, అదీ నెలల వయసు పిల్లాడికి ఈ ఘనత దక్కడం మరింత సంతోషమని చెబుతున్నాడు.

అన్నీ సవ్యంగా జరిగితే 2020లో అబార్షన్ కి ఉన్న చట్టబద్ధతను సుప్రీకోర్ట్ ఎత్తేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని యాంటీ అబార్షన్ రైట్స్ ఉద్యమకారులు భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన జరిగిందనీ, చట్టాల్లో మార్పులు జరిగాయని చెబుతున్నారు. అబార్షన్ వ్యతిరేకంగా పోరాటం చేసేవాళ్లకి న్యాయస్థానాల్లో పార్టీలకు అతీతంగా ప్రాతినిధ్యం ఉంటుందని మాట ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్ తన మాటను నిలబెట్టుకోవడం సంతోషంగా ఉందని వారు అంటున్నారు. ఇప్పటికే అబార్షన్ ని చట్టబద్ధం చేసే ఏడు చట్టాలకు సవరణలు జరగడం సంతోషకరమైన విషయమని చెబుతున్నారు. అబార్షన్ కి చట్టబద్ధతను పూర్తిగా తొలగిస్తే కచ్చితంగా అమెరికా నిజంగానే దయగల దేశంగా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ ఉద్యమానికి మద్దతిస్తున్నవారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Next Story